సద్గురు జగ్గీ వాసుదేవ్.. ఐపీఎల్‌లో మంచి టీమ్‌నే పట్టారుగా
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16వ ఎడిషన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ సీజన్ లో ఈ రెండు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్, ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్‌ను ముద్దాడని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆరంభంలో వరుసగా వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ ఆ తరువాత తేరుకుంది. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ ఇన్నింగ్‌కు ప్రాణం పోశాడు. తోటి యంగ్ ప్లేయర్ నేహాల్ వధేరాతో కలిసి భారీ భాగస్వామ్యాన్ని జట్టుకు అందించాడు. నేహాల్ 13 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, రెండు భారీ సిక్సర్లు ఉన్నాయి.

రోహిత్ శర్మ, కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి అంతర్జాతీయ ప్లేయర్లు దారుణంగా విఫలమైన చోట తిలక్ వర్మ సత్తా చాటాడు. ఈ సీజన్ లో తాను ఆడుతోన్న తొలి మ్యాచ్‌లోనే అర్ధసెంచరీని అందుకున్నాడు. 46 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 84 పరుగులతో నాటౌట్‌గా క్రీజ్‌లో నిలిచాడు. అతని ధాటికి ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ సాధించింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ దూకుడుగా ఆడుతోంది. కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ ఇన్నింగ్‌ను ఆరంభించారు. ముంబై ఇండియన్స్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఫాఫ్ డుప్లెసిస్ కేప్టెన్సీ ఇన్నింగ్‌ను ఆడుతున్నాడు. ప్రస్తుతం అతను 33 బంతుల్లో అయిదు భారీ సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 59 పరుగులు చేశాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ అతనికి సహకారాన్ని అందిస్తోన్నాడు. 33 బంతుల్లో కోహ్లీ రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 45 పరుగులు చేశాడు.
టార్గెట్‌ను వారిద్దరే ఛేదించేలా కనిపిస్తోంది ప్రస్తుతం ఉన్న మ్యాచ్ స్థితిగతులను బట్టి చూస్తోంటే. జేసన్ బెహ్రెండార్ఫ్ రెండు ఓవర్లల్లో 21, జోఫ్రా అర్చర్ రెండు ఓవర్లల్లో 22, పీయూష్ చావ్లా తన నాలుగు ఓవర్ల కోటాలో 26, కామెరాన్ గ్రీన్, హృతిక్ షోకీన్ ఒక్కో ఓవర్‌కు 17 చొప్పున పరుగులు సమర్పించుకున్నారు. కాగా- ఈ మ్యాచ్‌లో సద్గురు జగ్గీ వాసుదేవ్ సందడి చేశారు. వీఐపీ బాక్స్‌లో ఆయన ఆర్సీబీ ఫ్రాంఛైజీ ఓనర్లతో కలిసి కనిపించారు. ఆర్సీబీ సపోర్టర్‌గా నిలిచారు.
Sadhguru supporting RCB from the stands. pic.twitter.com/I0v3IKdkEi
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 2, 2023
ప్రస్తుతం సద్గురు జగ్గీ వాసుదేవ్.. కర్ణాటక-ఏపీ సరిహద్దుల్లోని చిక్‌బళ్లాపూర్ జిల్లాలో ఆదియోగి ఆశ్రమాన్ని నిర్మిస్తోన్నారు. దీని నిర్మాణం దాదాపుగా పూర్తయింది. తమిళనాడు-కేరళ సరిహద్దుల్లోని కోయంబత్తూరు జిల్లాలో నిర్మించినట్టే ఇక్కడ రెండు రాష్ట్రాల ప్రజలు సందర్శించడానికి వీలుగా సరిహద్దుల్లోనే ఆయన ఈ ఆదియోగి ఆశ్రమం నిర్మాణానికి పూనుకున్నారు. త్వరలోనే ఇది పూర్తి కానుంది. ఈ ఏడాది శివరాత్రికి లక్షలాది మంది ఆదియోగి క్షేత్రాన్ని సందర్శించారు.












Click it and Unblock the Notifications