IPL 2023 : ఈసారి ఐపీఎల్ విన్నర్, రన్నర్లకు ప్రైజ్ మనీ ఇదే- మిగతా అవార్డులకు ఎంతెంతంటే ?
ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న దేశ, విదేశీ క్రికెట్ లీగ్ ల్లో అత్యంత ధనిక లీగ్ గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు పేరుంది. 2008లో తొలిసారి ప్రారంభమైన ఐపీఎల్ టోర్నీ అప్పటి నుంచి నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రతీ ఏటా టోర్నీలో విజేతలకు ఇచ్చే బహుమతి విలువ కూడా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి విజేతలతో పాటు రన్నరప్ కు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంత ? తొలి ఐపీఎల్ సీజన్ తో పోలిస్తే ఎలా పెరుగుతూ వచ్చిందన్న అంశాల్ని ఓసారి చూసేద్దాం..
2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పుడు అప్పటివరకూ క్రికెట్ పై ఉన్న అభిప్రాయాన్ని మార్చేయడమే కాకుండా ప్రైజ్ మనీ విషయంలోనూ గణనీయమైన మార్పును తీసుకొచ్చింది. అప్పట్లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.4.8 కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చారు. రన్నరప్‌కు తొలి రెండు ఎడిషన్లలోనూ రూ.2.4 కోట్లు లభించాయి. అప్పట్లో ఇది ఏ క్రికెట్ ఈవెంట్‌కైనా అత్యధిక ప్రైజ్ మనీ గా నిలిచింది.

ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత ఐపీఎల్ 2023లో విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ లభించబోతోంది. రేపు జరిగే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, చెన్నె సూపర్ కింగ్స్ జట్లలో విజేతగా నిలిచిన వారికి ఈ మొత్తం లభించబోతోంది. అలాగే రన్నరప్ కు రూ.13 కోట్ల మొత్తం లభించనుంది. ఈ లెక్కన చూస్తే ఐపీఎల్ తొలి సీజన్ తో పోలిస్తే ప్రైజ్ మనీ దాదాపు నాలుగు రెట్లు పెరిగిందని తెలుస్తోంది. ఈ ప్రైజ్ మనీని రాబోయే సీజన్లలో మరింత పెంచేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో అన్ని జట్ల మొత్తం ప్రైజ్ మనీని రూ.46.5 కోట్లుగా నిర్ణయించారు. విజేతకు రూ.20 కోట్లు, రన్నరప్ కు రూ.13 కోట్లు ఇచ్చిన తర్వాత ఇంకా రూ. 13.5 కోట్లు మిగులుతాయి. దీంతో మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.7 కోట్లు, నాల్గవ స్ధానంలో నిలిచిన జట్టుకు రూ. 6.5 కోట్లు ఇవ్వబోతున్నారు. వీటితో పాటు వ్యక్తిగత రికార్డులకు ఇచ్చే మొత్తాల్ని కూడా భారీగా పెంచారు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌కు ఆరెంజ్ క్యాప్ తో పాటు రూ. 15 లక్షల నగదు బహుమతిని ఇస్తారు.

అలాగే సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన పర్పుల్ క్యాప్ బౌలర్‌కు కూడా రూ.15 లక్షలు ఇస్తారు. అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌కు రూ. 20 లక్షలు ఇస్తారు. సీజన్‌లో మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్ కు రూ. 12 లక్షలు, పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ కు రూ.15 లక్షలు, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ కు రూ.12 లక్షలు లభిస్తాయి.












Click it and Unblock the Notifications