తస్మాత్ జాగ్రత్త : రెచ్చిపోతున్న దొంగలు.. జనగాంలో పట్టపగలే చోరీ
జనగాం : దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసులు నిఘా పెంచినా.. సీసీ కెమెరాలతో వెంటాడుతున్నా చోరీలకు మాత్రం కళ్లెం వేయలేకపోతున్నారు. ఒకవైపు చైన్ స్నాచర్లు ఉదయం పూట రెచ్చిపోతుంటే.. మరోవైపు పట్టపగలు జనం సంచరించే సమయంలోనూ దొంగలు యధేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు.
జనగాం టౌన్‌లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయిన ఘటన స్థానికంగా భయాందోళన రేకెత్తించింది. సాయి నగర్ ప్రాంతంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకెళ్లారు. బీరువాను పగులగొట్టి లక్షా యాభై వేల రూపాయల నగదుతో పాటు అయిదున్నర తులాల బంగారు ఆభరణాలు, ఇరవై ఐదు తులాల వెండి వస్తువులు దోచుకెళ్లారు.

బయటకు వెళ్లొచ్చిన ఆ కుటుంబ సభ్యులు తలుపులు తెరిచి ఉండటంతో షాక్ తిన్నారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళం పగులగొట్టినట్లు కనిపించింది. తీరా నగదు, బంగారు ఆభరణాల కోసం చూడగా అవి కనిపించలేదు. దాంతో బాధితురాలు బాలామణి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications