రైల్వే కోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుమంది దుర్మరణం: జగన్ దిగ్భ్రాంతి- నష్టపరిహారం
రాయచోటి: అన్నమయ్య రాయచోటి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. 20 మందికి పైగా గాయపడ్డారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలోని ఓబులవారిపల్లి మండలం చిన్న ఓరంపాడు వద్ద శనివారం సాయంత్రం ఈ ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సును వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. ఆసుపత్రికి తరలిస్తోండగా.. మరో ఇద్దరు మరణించారు.

తీవ్ర గాయపడిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్సను అందజేస్తోన్నారు. పాక్షికంగా గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. తిరుపతి వైపు నుంచి కడపకు వెళ్తోన్న ఆర్టీసీ బస్సును చెన్నై వైపు వెళుతున్న ఓ లారీ అదుపు తప్పి బలంగా ఢీకొట్టింది. బస్సు కుడివైపు భాగం మొత్తం కోసుకుపోయింది. రేకులన్నీ ఊడివచ్చాయి.
బస్సును ఢీకొట్టిన లారీ రోడ్డు పక్కన పల్టీ కొట్టిందంటే అది ఎంత వేగంతో ప్రయాణించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనతో కడప-రేణిగుంట మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా పడిపోయిన లారీని క్రేన్ సహాయంతో పక్కకు తప్పించారు.

ఈ దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డవారికి రెండు లక్షల రూపాయల నష్టపరిహారం, పాక్షికంగా గాయపడ్డవారికి 50,000 రూపాయల చొప్పున సహాయం చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications