APSRTC: భక్తులకు గుడ్ న్యూస్: గురు పౌర్ణమికి షిర్డీకి స్పెషల్ బస్: ఛార్జీల వివరాలివే
కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరుసగా ప్రత్యేక బస్సులను ప్రవేశపెడుతోంది. పర్యాటకాభివృద్ధి సంస్థతో పోటీ పడుతోంది. ఏపీటీడీసీ తరహాలోనే ప్రయాణికుల కోసం అనేక పర్యాటక కేంద్రాలకు బస్సులను అందుబాటులోకి తీసుకొని వస్తోంది. వాటికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోండటంతో వాటిని ఇతర ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలకు విస్తరిస్తోంది.
ఇప్పటికే తమిళనాడులోని అరుణాచలం, వేలాంకిణికి సమ్మర్ స్పెషల్ సర్వీసులను ప్రవేశపెట్టింది. పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక కేంద్రాలకూ సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక బస్ సర్వీసులను ప్రవేశపెట్టడానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఊటీ, గోవా, పుదుచ్చేరికి ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీకెండ్ సర్వీస్ పేరుతో ప్రతి శనివారం నెల్లూరు నుంచి పుదుచ్చేరి మధ్య ప్రవేశపెట్టిన బస్సుకు మంచి డిమాండ్ లభిస్తోంది.

విజయవాడ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సును నడిపించనుంది ఏపీఎస్ఆర్టీసీ. జులై 3వ తేదీన గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకుంది. పౌర్ణమి నాడు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడం పుణ్యకార్యంగా భావిస్తారు భక్తులు. గిరి ప్రదక్షిణ అనంతరం అగ్నిరూపంలో వెలిసిన అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల ముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు.
అదే సమయంలో కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి షిర్డీకి ప్రత్యేక బస్సును నడిపించనుంది. జులై 1వ తేదీన ప్రొద్దుటూరు నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ బస్సు షిర్డీకి బయలుదేరి వెళ్తుంది. మైదుకూరు, ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు నుంచి ఈ బస్సుకు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు ఆర్టీసీ అధికారులు. ప్రొద్దుటూరు నుంచి బయలుదేరే ఈ ప్రత్యేక బస్సు సాయంత్రానికి తొలుత జోగులాంబ అమ్మవారికి ఆలయానికి చేరుకుంటుంది.

దర్శనానంతరం మహారాష్ట్రలోని తుల్జాపూర్ భవానీ మాత ఆలయానికి బయలుదేరి వెళ్తుంది. మరుసటి రోజు తెల్లవారు జామున తుల్జాపూర్‌కు చేరుకుంటుంది. అమ్మవారి దర్శనానంతరం శని సింగ్నాపూర్‌కు బయలుదేరుతుంది. ఆ తరువాత షిర్డీకి చేరుకుంటుంది. ఈ బస్సులో ఒక్కో ప్రయాణికుడికి 4,600 రూపాయల ఛార్జీని వసూలు చేస్తారు.












Click it and Unblock the Notifications