వైఎస్ జగన్ బస్సు యాత్రకు చిన్న బ్రేక్
YS Jagan Bus Yatra: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్తోంది. మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రతో జనంలోకి దూసుకెళ్తోంది. ఇడుపుల పాయలో ప్రారంభమైన ఈ బస్సు యాత్ర ఇచ్ఛాపురం వరకు కొనసాగనుంది.
కడపలో యాత్రను ఆరంభించిన అనంతరం నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు మీదుగా ప్రకాశం మీదుగా పల్నాడు జిల్లాలో అడుగు పెట్టారు వైఎస్ జగన్. 13వ రోజున పిడుగురాళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారాయన.

కాగా.. నేడు బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రేక్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ నాయకులతో జగన్ సమావేశం కానున్నారు. గుంటూరు, నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థులు కిలారి రోశయ్య, అనిల్ కుమార్ యాదవ్ సహా ఈ రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నవారు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మరికొందరు కీలక నాయకులు ఇందులో పాల్గొంటారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ స్థితిగతులపై ఆరా తీయనున్నారు. ఇప్పటివరకు బస్సు యాత్రకు వచ్చిన జనాదరణ, వారి నుంచి అందిన వినతిపత్రాలు, మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన హామీలపై కసరత్తు చేస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు 14వ రోజు బస్సు యాత్ర యధాతథంగా ప్రారంభమౌతుంది.
21 రోజుల పాటు బస్సు యాత్రను నిర్వహించాలని వైఎస్ జగన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇంకో వారం రోజుల్లో బస్సు యాత్ర ముగిసే అవకాశం ఉంది. ఈ నెల 18వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురానికి చేరుకుని అక్కడ బస్సు యాత్ర ముగింపు సభలో ప్రసంగించేలా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది వైఎస్ఆర్సీపీ.












Click it and Unblock the Notifications