ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని అఖిల ఆత్మహత్య: డైరెక్టర్‌పై ఆగ్రహం
కడప: వైయస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. చదువులో ఒత్తిడిని భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం భోగ్యంపల్లెకు చెందిన యోగాంజనేయులు, విజయకుమారి దంపతుల కుమార్తె అఖిల(21) ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఈసీఈ చివరి సంవత్సరం చదువుతోంది.
సోమవారం క్యాంపస్‌లోని తోటి విద్యార్థినులు లేని సమయంలో కిటికీకి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అటుగా వెళ్లిన తోటి విద్యార్థిని తలుపు తట్టగా తీయలేదు. మరికొందరు విద్యార్థినులు అక్కడకి చేరుకుని కేకలు వేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెళ్లి చూడగా.. అఖిల కిటికీకి వేలాడుతూ విగత జీవిగా కనిపించింది.

ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్ విజయకుమార్, డైరెక్టర్ సంధ్యారాణి, అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది ఇలావుండగా, ఇడుపులపాయ చేరుకున్న విద్యార్థిని తల్లి, కుటుంబసభ్యులు.. వేంపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న అఖిల మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ప్రేమ విఫలం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా సమాచారం అందినట్లు డైరెక్టర్ సంధారాణి చెప్పడంతో.. విద్యార్థిని తల్లి, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ఆలోచనలు తమ బిడ్డకు లేవని, చదువులో ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. తమ కుమార్తె ఫోన్ చేసినప్పుడల్లా ఈ విషయమే చెప్పేదని విద్యార్థిని తల్లి వెల్లడించారు.












Click it and Unblock the Notifications