జగన్ ఒక్క రూపాయే జీతంగా తీసుకుంటారా? కారణం అదేనా?
అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంటూ జరిగితే- వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఒక్క రూపాయి జీతాన్ని తీసుకోవాలని వైఎస్ జగన్ యోచిస్తున్నారట. ఇదే విషయాన్ని కొందరు పార్టీ సీనియర్లు, సన్నిహితుల వద్ద ఆయన ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్.. ఈ దిశగా ఆలోచన చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. జగన్‌తో పాటు కొందరు మంత్రులు కూడా ఆయననే అనుసరించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

సలహాదారులుగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, అధికారంలోకి వస్తే- తొలుత దీన్ని సరిదిద్దాల్సి ఉంటుందని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థికపరమైన అంశాల్లో నిష్ణాతుడిగా పేరు తెచ్చుకున్న సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో ఈ విషయంపై ఆయన ఇదివరకే చర్చించినట్లు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితులను సరిదిద్దడానికి ఆ శాఖలో చాలాకాలం పాటు పనిచేసి, పదవీ విరమణ చేసిన కొందరు ఐఎఎస్ అధికారులను సలహాదారుగా నియమించుకోవాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం పేరును పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. సుదీర్ఘకాలం పాటు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన అనుభవం కూడా అజేయ కల్లంకు ఉంది. పైగా- పదవీ విరమణ చేసిన తరువాత చంద్రబాబు ప్రభుత్వ దుబారాపై ఆయన తరచూ స్పందిస్తున్నారు కూడా. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని అజేయ కల్లంను ఆర్థికశాఖ సలహాదారునిగా నియమించి, ఆయన సేవలను వినియోగించుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఆయనతో పాటు- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిష్పక్షపాతంగా, కీలక పదవుల్లో పనిచేసిన కొందరు అధికారులతో ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

ఐవైఆర్ అందుబాటులోనే ఉన్నా..
ఆర్థిక శాఖ అంటే ఐవైఆర్ గా, ఐవైఆర్ అంటే ఆర్థికశాఖగా గుర్తింపు ఉన్న మరో అధికారి ఐవైఆర్ కృష్ణారావు. ఎక్కువకాలం పాటు ఆర్థికశాఖలో పనిచేసిన అధికారిగా ఆయనకు గుర్తింపు ఉంది. అయినప్పటికీ- ఆయనను సంప్రదించడానికి వైఎస్ఆర్ సీపీ నాయకులు కొంత వెనుకంజ వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం- ప్రస్తుతం భారతీయ జనతాపార్టీ తీర్థాన్ని పుచ్చుకోవడమే. ఆయనపై ఏ రాజకీయ పార్టీ ముద్ర లేకుండా ఉండి ఉంటే- ఐవైఆర్ ను కూడా సలహాదారునిగా తీసుకుని ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.

దుబారాను అరికట్టే దిశగా..
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్.. ఒక్క రూపాయి జీతాన్ని తీసుకోవడం అనేది- కొందరు అధికారులు, మంత్రులకు కూడా ఓ హెచ్చరిక సందేశాన్ని పంపించినట్టవుతుందని భావిస్తున్నారు పార్టీ సీనియర్లు. ఆర్థికపరమైన దుబారాను అరికట్టడానికి స్వయంగా ముఖ్యమంత్రే ఒక్క రూపాయి జీతాన్ని తీసుకుంటుండగా..తాము నిధులను దుర్వినియోగం చేయడం బాగుండదనే సందేశాన్ని ఇచ్చినట్టవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఫలితంగా- అటు అధికారులు గానీ, ఇటు సహచర మంత్రివర్గ సభ్యులు గానీ ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తారనే అభిప్రాయాలు పార్టీ సీనియర్ నేతల్లో వ్యక్తమౌతోంది.

అయిదు మంది మంత్రులు కూడా..
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, ఒక్క రూపాయి వేతనాన్ని తీసుకోవడమంటూ జరిగితే- కొందరు మంత్రులు కూడా ఆయన బాటలోనే నడిచే అవకాశాలు ఉన్నాయి. తమకు మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని భావిస్తున్న కొందరు మంత్రులు ఇదే విషయాన్ని వైఎస్ జగన్ వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ఈ అంశంపై ఆయనతో చర్చించారని, ఆయన నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామంటూ కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు చెబుతున్నారు. వైఎస్ జగన్ మంత్రివర్గంలో కనీసం అయిదుమంది మంత్రులు- ఒక్క రూపాయి జీతాన్ని తీసుకుంటామని తేల్చి చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనా?
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతీసారీ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే తయారవుతుందనే ఆరోపణలు వైఎస్ఆర్ సీపీ శ్రేణుల్లో వ్యక్తమౌతున్నాయి. చంద్రబాబు తొలిసారిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన 1994-2004 మధ్యకాలంలోనూ ఇవే పరిస్థితులు తలెత్తాయని, తాజాగా కూడా ఆర్థికంగా అవే దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయని అంచనా వేస్తున్నారు. ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ అయిదేళ్ల కాలంలో ఆర్టీసీ ఏకంగా 6,500 కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుని పోవడం.. చంద్రబాబు ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందని అంటున్నారు.

ప్రత్యేక విమానాల్లో చక్కర్లు..అనవసర ప్రచార డప్పు
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే చంద్రబాబు ప్రభుత్వం దుబారాకు తెర తీసిందని విమర్శిస్తున్నారు వైఎస్ఆర్ సీపీ నాయకులు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని అంటూనే ఆర్థికంగా దివాళా తీయించారని ఆరోపిస్తున్నారు. దావోస్, సింగపూర్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, తజకిస్తాన్, శ్రీలంక అంటూ ఓ దేశ ప్రధానమంత్రికి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో చంద్రబాబు ప్రపంచ దేశాలను చుట్టొచ్చారని, ఫలితంగా వందల కోట్ల రూపాయలు దుబారా అయ్యాయని మండిపడుతున్నారు. విభజిత రాష్ట్రంలో తాను చెట్టు కింద కూర్చుని అయినా పరిపాలన సాగిస్తానంటూ 2014 ఎన్నికల సభల్లో ప్రచారం చేసుకున్న చంద్రబాబు- అధికారంలోకి వచ్చిన అనంతరం ఏసీ గదులు, ప్రత్యేక విమానాలకు పరిమితం అయ్యారని విమర్శిస్తున్నారు. 16 వేల కోట్ల రూపాయల ఆర్థికలోటుతో ఏర్పడిన రాష్ట్రంలో ఈ అయిదేళ్ల కాలంలో అప్పులు రెండు లక్షల కోట్ల రూపాయలకు పైమాటేనని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కించడానికి ఆర్థిక దుబారాను పూర్తిగా నియంత్రించాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications