సన్యాసం స్వీకరించిన కడప జిల్లా మాజీ ఎమ్మెల్యే: వైఎస్సార్ హయాంలో చక్రం తిప్పి: కొత్త పేరిదే
కడప: కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సన్యాసాన్ని స్వీకరించారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన ప్రస్తుతం సర్వసంగ పరిత్యాగిలా మారిపోయారు. సర్వం త్యజించారు. కాషాయ దుస్తులను ధరించారు. ఆయనే- వీ శివరామకృష్ణా రావు. కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. మరోమారు పోటీ చేసి, ఓటమి చవి చూశారు.
ఈ ఉదయం ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి తీరంలో సన్యాసాన్ని స్వీకరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శివరామృష్ణారావుతో సన్యాసాన్ని స్వీకరింపజేసిన గురువు..ఆయన పేరును మార్చివేశారు. స్థితప్రజ్ఙగా కొత్తగా నామకరణం చేశారు. పాతపేరును మరిచిపోవాలని, స్థితప్రజ్ఞగా ఇక సన్యాస జీవితాన్ని కొనసాగించాలంటూ బోధించడం ఈ వీడియోలో రికార్డయింది.

శివరామకృష్ణా రావు సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగారు. 1978లో తొలుత జనతా పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తంగా అయిదు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా బద్వేలు శాసనసభ స్థానం నుంచి పోటీ చేశారు. మూడు సార్లు ఓటమి చవి చూశారు. 2001లో తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే బిజినివేముల వీరారెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో పోటీ చేసి.. ఓడిపోయారు.

అప్పటి నుంచీ ఇక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2009లో బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్‌గామారింది. వృత్తిరీత్యా ఆయన డాక్టర్. ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతూ వస్తూనే వివిధ దినపత్రికల్లో వ్యాసాలను రాసేవారు. తాజాగా ఆయన సన్యాసాన్ని స్వీకరించడం కలకలం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.