చంద్రబాబు ఆఫర్ తిరస్కరణ: జగన్ వైపే పులివెందుల టీడీపీ నేత
TDP Janasena alliance: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు, శాసనమండలి మాజీ వైస్ ఛైర్మన్ సతీష్ రెడ్డి.. తన నిర్ణయం ఏమిటో తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికే మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకోనున్నారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సతీష్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు చంద్రబాబు. పులివెందుల టికెట్‌ను మరో సీనియర్ నాయకుడు బీటెక్ రవికి కేటాయించారు. కడప జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, సురేష్ బాబు.. ఇటీవలే సతీష్ రెడ్డిని కలిశారు. తమ పార్టీలో చేరాలంటూ ఆహ్వానించారు.

దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే తన అనుచరులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని, వారి సూచనలు, సలహాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. దీనికి అనుగుణంగా నేడు జిల్లాలోని వేంపల్లిలో తన అనుచరులతో సమావేశం అయ్యారు సతీష్ రెడ్డి. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
తన అనుచరుల నిర్ణయం మేరకు వైసీపీలో చేరడానికి సిద్ధం అయ్యానని సతీష్ రెడ్డి తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా తాను రాజకీయాలకు దూరంగా ఉంటోన్నానని, తన అనుచరులు మాత్రం పునరాగమనం చేయాలని కోరుకుంటోన్నారని అన్నారు. వారి కోరిక మేరకు మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని అన్నారు.
తాను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి 2020 వరకు తెలుగుదేశం పార్టీకి ఎంతో కృషి చేశానని సతీష్ రెడ్డి అన్నారు. టీడీపీని తన కుటుంబంగా భావించానని, ఈ నాలుగేళ్లల్లో తనను ఏనాడూ పట్టించుకోలేదని చెప్పారు. నేను నమ్మిన చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్.. తనను అవమానించారని విమర్శించారు. వైఎస్ కుటుంబంతో లాలూచి పడ్డాననే నిందారోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనను ఇంతగా అవమానించిన తరువాత టీడీపీలో ఉండటం సరికాదని ఆ రోజే రాజీనామా చేశానని సతీష్ రెడ్డి వివరించారు. తన శ్రేయోభిలాషులు చంద్రబాబును అడిగినా ఆయన పట్టించుకోలేదని చెప్పారు. నాలుగు రోజుల నుంచి పరిస్థితులు మారాయని సతీష్ రెడ్డి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తన వారిని పంపించి.. పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉందని సతీష్ రెడ్డి చెప్పారు. తాను ఎవరితో పోరాడానో వాళ్లే స్నేహ హస్తం అందించారని అన్నారు. జగన్ తన వారిని పంపించిన తరువాత టీడీపీ నాయకులు తనతో సంప్రదింపులు మొదలుపెట్టారని వ్యాఖ్యానించారు.
25 సంవత్సరాలుగా తాను టీడీపీ కోసం ఏ రకంగా అయితే కష్టపడ్డానో.. అదే స్ఫూర్తితో, అదే కట్టుబాటుతో వైఎస్ఆర్సీపీ కోసం పని చేస్తానని సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. జగన్‌తో కలిసి పులివెందుల నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications