వివేకా హత్యకేసులో స్పీడ్ పెంచిన సిట్... హత్యకు ముందు రోజు రెక్కీ చేసిన సీసీ టీవీ ఫుటేజ్ ఆధారాలు
వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాబాయి, సీనియర్ పొలిటీషియన్ , మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది . ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణంగా హత్యకు గురైనా ఇప్పటి వరకు ఎవరు ఎందుకు ఆయన్ను హత్య చేశారు అనేది మాత్రం తెలియలేదు .మార్చి 15, 2019 న వైయస్ వివేకాను కడపలోని తన పులివెందుల నివాసంలో దారుణంగా హత్య చేశారు.

విచారణలో వేగం పెంచిన సిట్.. హత్యకేసు చేదించే పనిలో అధికారులు
ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగి రెడ్డి (ఎ 1), వ్యక్తిగత కార్యదర్శి ఎంవి కృష్ణారెడ్డి (ఎ 2), పని మనిషి కొడుకు ప్రకాష్ (ఎ 3) లుగా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ హత్య సంఘటన వెనుక టిడిపి నాయకులు ఉన్నారని కూడా అప్పట్లో వైసీపీ నాయకులు ఆరోపించారు. వైయస్ఆర్సిపి అధికారంలోకి రావడంతో, సిట్ అధికారులు దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేశారు. తన ఇంట్లో వివేకానందరెడ్డిని దుండగులు దారుణంగా గొడ్డళ్లతో నరికి చంపిన కేసులో గత ప్రభుత్వం వై ఎస్ వివేకా హత్యకేసు విచారణకు సిట్ ను నియమించినా అది కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు .దీంతో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త సిట్ ను నియమించి వై ఎస్ వివేకా హత్యకేసును ఛేదించే పనిలో పడింది .

హత్యకు ముందు రోజు వివేకా ఇంటి ముందు ఇద్దరు రెక్కీ .. ఆరా తీస్తున్న పోలీసులు
వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి నాలుగు నెలలు అయింది. ఈ హత్య కేసు విచారణ కోసం జగన్ ప్రభుత్వం సిట్ ను నియమించింది. ఈ హత్య కేసు దర్యాప్తులో వేగం పెంచిన సిట్ అధికారులు వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు ముందు రోజు జరిగిన పరిణామాలపై దృష్టిసారించారు. హత్యకు ముందు రోజు వైయస్ వివేకా ఇంటికి సమీపంలో ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లుగా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ లో వ్యక్తుల ఆనవాళ్ళు సరిగా కనిపించక పోవడంతో వారు ఉపయోగించిన హోండా షైన్ బైక్ ఎవరిది అన్న దానిపై దృష్టి సారించారు. ఇక పులివెందుల నియోజకవర్గం లోని ఏడు మండలాల్లో ఏడుగురు ఎస్ఐ ల ఆధ్వర్యంలో షైన్ స్ప్లెండర్ ప్లస్ వాహనాల యజమానులను పిలిచి విచారిస్తున్నారు.
ఇక అక్కడ రెక్కీ నిర్వహించిన వ్యక్తుల ఆనవాళ్ళు దొరికితే ఈకేసులో పురోఅతి సాధించినట్టేనని సిట్ అధికారులు భావిస్తున్నారు. వారం రోజుల్లో రెక్కీ నిర్వహించిన వ్యక్తి ఎవరో పట్టుకు తీరుతామని వారంటున్నారు.

ప్రధాన నిందితులకు నార్కో పరీక్షలు .. వారి కాల్ డేటా పరిశీలన, వారు చెప్పే విషయాలు కీలకమే
ఇక విచారణలో భాగంగా వివేకా హత్య కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న వివేకా ముఖ్య అనుచరుడైన గంగిరెడ్డికి, వాచ్ మ్యాన్ రంగయ్యకు, కిరాయి హంతకుడు శేఖర్ రెడ్డి కి నార్కో అనాలిసిస్ పరీక్షలను నిర్వహించటానికి కోర్టు అనుమతి ఇవ్వటంతో వారిని హైదరాబాద్ కు తరలించి నార్కో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద్ రెడ్డి హత్య నాలుగు నెలల క్రితం జరిగినప్పటికీ, సిట్ ఒక్క క్లూని సైతం సేకరించడంలో విఫలమైంది, ఇది కేసు దర్యాప్తుకు సహాయపడుతుంది. అందుకే నిందితుల కాల్ డేటాను పరిశీలించడమే కాకుండా, హత్య సంఘటనకు ముందు జరిగిన కార్యకలాపాలపై సిట్ అధికారులు దృష్టి సారించారు.












Click it and Unblock the Notifications