కాళ్లతోనే కవితలు రాసిన సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూత: కేటీఆర్ సంతాపం
కరీంనగర్: అంగవైకల్యాన్ని జయించి ఆమె కవయిత్రిగా ఎదిగారు. ఎన్నో కవితలు, రచనలు చేసి ప్రముఖుల మన్ననలు పొందారు. సిరిసిల్ల రాజేశ్వరి(44)గా పేరుపొందిన ఆమె బుధవారం కన్నుమూశారు. రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన కవయిత్రి రాజేశ్వరి.. అనారోగ్యం కారణంగా మృతి చెందారు. కాళ్లతోనే కవితలు రాసి ఎన్నో ప్రశంసలందుకున్న రాజేశ్వరి మరణించడంపై కవితాలోకం, ప్రముఖులు సంతాపం తెలిపారు.

కాళ్లతోనే 700కుపైగా కవిత రాసిన రాజేశ్వరి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో తమ కుటుంబానికి కేటాయించిన డబుల్ బెడ్రూం ఇంట్లోనే అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరి బుధవారం మరణించారు. రెండు నెలలుగా ఆమె నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఆమెను కంటికి రెప్పలా చూసుకునే తల్లి కూడా ఇటీవలే మరణించారు. సిరిసిల్ల సాయినగర్ కు చెందిన బూర రాజేశ్వరి పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఇంటర్మీడియట్ వరకు చదివిని ఆమె.. ఓ టీవీ కార్యక్రమంలో ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాటలు విని.. ఆ ప్రభావంతో కాళ్లతోనే కవితలు రాయడం ప్రారంభించారు రాజేశ్వరి. వైకల్యంతో చేతులు పనిచేయకపోయినా, కాళ్లతో కలాన్ని పట్టి 700 పైగా కవితలు రాసి ఎంతో మంది నుంచి రాజేశ్వరి ప్రశంసలు అందుకుంది.

సిరిసిల్ల రాజేశ్వరి అని పెట్టింది సుద్దాల అశోక్ తేజ
ఇప్పటి వరకు రాజేశ్వరి.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహన్యం, దాశరథి, నేత కార్మికులు, కరోనా వైరస్, వరకట్న వేధింపులపై కవితలు రాసి కవిత్వానికి వైకల్యం అడ్డురాదని నిరూపించారు. ఆమె సాహిత్యం, కృషిని మెచ్చిన సుద్దాల అశోక్ తేజ సిరిసిల్ల రాజేశ్వరి అని పేరు పెట్టారు. ఆమె కవితలతో ఒక పుస్తకాన్ని అచ్చువేయించారు. ఆయన చొరవతోనే రాష్ట్ర ప్రభుత్వం రాజేశ్వరి జీవిత చరిత్రను తెలుగు పాఠ్యపుస్తకంలో ఓ పాఠ్యాంశంగా చేర్చి గుర్తింపునిచ్చింది.

స్ఫూర్తివంతం..: రాజేశ్వరి మృతి పట్ల కేటీఆర్ సంతాపం
రాజేశ్వరి మృతి పట్ల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.
నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి, తన వైకల్యాలను జయించి ఆత్మవిశ్వాసంతో కాళ్లనే చేతులుగా మల్చుకొని కవితలు రాసిన తీరు అద్భుతం. వైకల్యాన్ని సైతం ధిక్కరించి ఆత్మవిశ్వాసపు అక్షరాలను కవిత్వంలో ఆవిష్కరించిన సిరిసిల్ల రాజేశ్వరి ఇక లేరు. సోదరి రాజేశ్వరికి వినమ్రంగా నివాళులు అని పేర్కొన్నారు. 'సంకల్పం ముందు వైకల్యం ఎంత! దృడ చిత్తం ముందు దురదృష్టం ఎంత! ఎదురీత ముందు విధిరాత ఎంత. పోరాటం ముందు ఆరాటం ఎంత' అని వ్యాఖ్యానించారు.
రాజేశ్వరి ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి కేటీఆర్ ప్రార్థించారు. కాగా, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సిరిసిల్ల రాజేశ్వరి ప్రతిభను మెచ్చి రూ.10 లక్షలు ప్రభుత్వం తరపున ఫిక్స్డ్ చేయించారు. దీంతో నెల నెల రూ.10 వేల పెన్షన్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications