కరీంనగర్‌లో ఘోర ప్రమాదం.. మానేరు బ్రిడ్జి పైనుంచి కిందపడ్డ కారు..
కరీంనగర్‌లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అలుగునూరు సమీపంలోని మానేరు వంతెన పైనుంచి ఓ కారు అదుపు తప్పి కింద పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా.. అందులో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
మృతుడిని కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గాయపడ్డవారిని శ్రీనివాస్ భార్య,బిడ్డలుగా గుర్తించినట్టు సమాచారం. ఇక సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన శంకర్ అనే కానిస్టేబుల్ కూడా వంతెన పైనుంచి కింద పడిపోయాడు.
దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో అతను చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కాగా, కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్తున్న క్రమంలో శ్రీనివాస్ కారు ప్రమాదానికి గురైందని చెబుతున్నారు.

ఇక వరంగల్ అర్బన్ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం శాంతినగర్ వద్ద కూడా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రిటైర్డ్ సీఐ విజయ్ కుమార్, ఆయన భార్య మృతి చెందారు. వీరి కుమార్తెతో పాటు కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రస్తుతం వీరు హుజూరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ టీచర్స్ కాలనీలో తన తల్లి అంత్యక్రియలకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో విజయ్,ఆయన భార్య మృతదేహాలను కూడా టీచర్స్ కాలనీకి తరలించారు.


Click it and Unblock the Notifications