ఆన్ లైన్ పే.. గూగుల్ పే, ఫోన్ పే.. నయా టెక్నాలజీ.. హుజురాబాద్‌లో చేతికి డబ్బులు లేవు
హుజురాబాద్ బై పోల్ షెడ్యూల్ విడుదల కావడంతో.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇవాళ నోటిఫికేసన్ రానుంది. ఈసీ పరిమితి మేరకు ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే హుజురాబాద్‌లో టీఆర్ఎస్ నిబంధనలను బ్రేక్ చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.
హైదరాబాద్ బుద్ధభవన్‌లో చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్‌ను బీజేపీ నాయకులు నల్లు ఇంద్రసేనా రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి కలిసి ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ నేతలు ఓటర్లకు గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా వివిధ స్కీంల పేరుతో సీఎం కేసీఆర్, మంత్రుల ఫొటోలు పెట్టి ప్రకటనలు ఇస్తున్నారని పేర్కొన్నారు.
మరోవైపు ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఖరారు కాలేదు. నలుగురు పేర్లతో హైకమాండ్‌కు లిస్ట్ పంపించారు. ఇక అక్కడినుంచి ఆమోద ముద్ర రాలేదు. అయితే అంతకుముందు కొండా సురేఖను సంప్రదించారని తెలుస్తోంది. కానీ పోటీ చేయనని స్పష్టంచేయడంతోనే.. ఇతర నేతల పేర్లతో జాబితా రూపొందించినట్టు సమాచారం. నలుగురిలో రవికుమార్, పత్తి కృష్ణారెడ్డిలో ఒకరికీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.

కొండా సురేఖ కాదని స్పష్టంచేసిన తర్వాతే.. మిగతా నేతల వైపు కాంగ్రెస్ పార్టీ చూసింది. ఆమెను పోటీ చేయించాలని అనుకున్నారు. కానీ ఆమె విధించిన షరతును అంగీకరించే పరిస్థితి లేదు. అందుకే హామీ ఇవ్వలేదు. హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీపై కాంగ్రెస్ నేత కొండా సురేఖ ఇదివరకు చెప్పారు. హుజురాబాద్‌లో పోటీ చేసినా.. మళ్లీ వరంగల్‌కే వస్తానని చెబుతున్నారు. అంటే 2023లో మళ్లీ వరంగల్ నుంచి పోటీ చేస్తానని.. హుజురాబాద్ నుంచి పోటీ చేయనని ఆమె షరతు విధించారు. తనకు అలాంటి హామీ వస్తేనే హుజురాబాద్‌లో పోటీచేస్తానని కొండా సురేఖ తెలిపారు. దీనిపై కాంగ్రెస్ నేతలు హామీ ఇవ్వలేదు. దీంతో కొండా సురేఖ కూడా దూరంగా ఉన్నారు.
మున్నురుకాపు సామాజిక వర్గానికి చెందిన కృష్ణారెడ్డి, రవికుమార్, ప్యాట రమేశ్.. దళిత సామాజిక వర్గానికి చెందిన సైదులు పేర్లను హైకమాండ్‌కు పంపించారు. గతంలో కౌశిక్ రెడ్డి పోటీ చేసి.. భారీగానే ఓట్లు సాధించారు. ఈ సారి ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో అభ్యర్థి వేట తప్పడం లేదు. ఓ క్రమంలో పొన్నం ప్రభాకర్ పేరు వినిపించింది. తర్వాత కొండ సురేఖ పేరు కూడా తెరపైకి వచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్ పార్టీ తరపున విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు. రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీ తరుఫున పోటీ చేస్తున్నారు. కాగా తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో తన ఎమ్మెల్యే పదవికి జూన్ 12న ఆయన రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నవంబర్ 2న కౌంటింగ్ చేపట్టనున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అక్టోబర్ 8వరకు నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13గా ప్రకటించింది. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల నిర్వహించి.... నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది.