Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసిన మంత్రి పువ్వాడ అజయ్, 28న ఖమ్మం పర్యటన
హైదరాబాద్/ఖమ్మం: ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కలిశారు. ఖమ్మం నగరాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చుతున్న క్రమంలో లకారం ట్యాంక్ బండ్‌పై సినీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
దాదాపు 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ నిలువెత్తు రూపానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. శతజయంతి రోజున అంటే మే 28న ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. దీంతో పర్యాటక నగరానికి సరికొత్త అలంకరణ దక్కబోతోందని ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మే 28న ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన మనుమడైన జూనియర్ ఎన్టీఆర్ చేతులమీదుగా ఆవిష్కరింపజేయాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల్లోని ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ తోపాటు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
ఈ భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ఏడాది శతజయంతి ఉత్సవాల ప్రారంభ సమయంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, పలువురు ఎన్నారైలు, ఎన్టీఆర్ అభిమానులు నిర్ణయించారు. ఈ క్రమంలో మంత్రి పువ్వాడ అజయ్, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ తోపాటు ఖమ్మానికి చెందిన ఎన్టీఆర్ ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్, పలువురు పారిశ్రామిక వేత్తలు, తానా సభ్యలు, ఎన్నారైలు ఆర్థికంగా తమవంతుగా అందించేందుకు ముందుకు వచ్చారు.
సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో ఏర్పాటు కాబోతున్న ఎన్టీఆర్ విగ్రహంతో ఖమ్మం నగరానికి మరింత శోభను తెస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పువ్వాడ అజయ్ మంగళవారం జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు సంబంధించిన విషయాలు చర్చించారు. కాగా, 36 అడుగుల పొడవు వెడల్పులతో వెయ్యి అడగుల విస్తీర్ణం ఉండే బేస్‌మెంట్‌పై ఎన్టీఆర్ విగ్రహాన్ని అమర్చనున్నారు.












Click it and Unblock the Notifications