కర్నూలుకు వైఎస్ జగన్: రాజకీయ ప్రత్యర్థులందరూ ఒకే వేదికపై కనిపించే ఛాన్స్
కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస జిల్లా పర్యటలను చేపట్టారు. తన పుట్టినరోజు నాడు పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లారు. తణుకులో సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభించారు. ఈ మధ్యాహ్నం ఆయన కర్నూలు జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటన రాజకీయంగా కొంత ఆసక్తికరంగా ఉండేది. మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే- కర్నూలులో కొంత భిన్నమైన సమీకరణాలు ఉన్న నేపథ్యంలో- వైఎస్ జగన్ నిర్వహించనున్న ఈ పర్యటనపై అందరి దృష్టి నిలిచింది.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాణ్యం శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడి వివాహానికి వైఎస్ జగన్ హాజరు కానున్నారు. కర్నూలు పంచలింగాలలోని మాంటిస్సోరి పాఠశాల సమీపంలోని ఓ ఫంక్షన్ హాలులో వివాహం జరుగనుంది. వైఎస్ జగన్‌తో పాటు జిల్లా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, ఇన్‌ఛార్జి మంత్రి పీ అనిల్ కుమార్ యాదవ్, జిల్లా ఎమ్మెల్యేలు, ఏపీ స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హాజరు కానున్నారు.

గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరే వైఎస్ జగన్ ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పంచలింగాలకు చేరుకుంటారు. మాంటిస్సోరి వద్ద ప్రత్యేకంగా హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ పీ కోటేశ్వర రావు, పోలీస్ సూపరింటెండెంట్ సుధీర్ కుమార్ రెడ్డి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కాటసాని రాంభూపాల్ రెడ్డి బంధువులు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఈ పెళ్లికి హాజరు కావచ్చని సమాచారం. 2014 నాటి ఎన్నికల్లో ఇదే పాణ్యం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా గెలిచిన చరిత రెడ్డి ఆ తరువాత పార్టీ ఫిరాయించారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. పాణ్యం నుంచే టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. వీరంతా ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications