Pawan Kalyan: కర్నూలు జిల్లా పర్యటన ఫిక్స్: సుగాలి ప్రీతి హత్యోదంతంపై ర్యాలీ..!
కర్నూలు: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా పర్యటనకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 12, 13 తేదీల్లో ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కర్నూలు జిల్లా పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలతో వరుసగా సమావేశాలను నిర్వహిస్తూ వస్తున్నారు. కర్నూలు జిల్లా పర్యటనకు రావాలంటూ పార్టీ నాయకులు పవన్ కల్యాణ్‌కు విజ్ఙప్తి చేశారు.

పవన్ కల్యాణ్ వస్తేనే..
కర్నూలు జిల్లాలో అనేక సమస్యలు పేరుకుపోయాయని, క్షేత్ర స్థాయిలో వాటిని పరిష్కరించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందంటూ జిల్లా నాయకులు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఫ్యాక్షన్ పోకడలను అనుసరిస్తున్నారని, గ్రామాల్లో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని వివరించారు. గ్రామీణ పరిపాలనను గాలికి వదిలేయడం ద్వారా కనీసం సౌకర్యాలకు కూడా ప్రజలు నోచుకోలేకపోతున్నారని చెప్పారు.

12, 13 తేదీల్లో విస్తృత పర్యటన..
ఇలాంటి పరిస్థితుల మధ్య జిల్లాలో పర్యటించాల్సిన అవసరం ఉందని కర్నూలు జిల్లా నాయకులు పవన్ కల్యాణ్‌కు సూచించారు. ఫలితంగా- జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి చేరుతాయని అభిప్రాయపడ్డారు. వారి విజ్ఙప్తుల పట్ల పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 12, 13 తేదీల్లో జిల్లా పర్యటనకు వస్తానని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేయాలని సూచించారు.

సుగాలి ప్రీతి హత్యోదంతంపై..
2017లో సుగాలి ప్రీతి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగట్లేదు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పవన్ కల్యాణ్.. ఈ నెల 12వ తేదీన కర్నూలులో భారీ నిరసన ప్రదర్శనను చేపట్టనున్నారు. సుగాలి ప్రీతిపై హత్యాచారం చేసిన ఘటనలో దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు నగరంలో ర్యాలీని నిర్వహించాలని జనసేన పార్టీ యంత్రాంగం నిర్ణయించింది.

13వ తేదీన జోహరాపురం వంతెన సమస్యపై
మరుసటి రోజు కర్నూలులోని జోహరాపురం వంతెన సమస్యను పరిష్కరించడానికి ఆయన స్థానిక అధికారులను కలుస్తారు. జోహరాపురం ప్రాంతాన్ని సందర్శిస్తారు. పేదల గృహ నిర్మాణ సమస్యపై స్థానికులతో సమావేశమవుతారు. అనంతరం ఎమ్మిగనూరు నియోజక వర్గంలో చేనేత కార్మికులతో సమావేశమవుతారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను జనసేన పార్టీ యంత్రాంగం తాజాగా ఖరారు చేసింది.












Click it and Unblock the Notifications