పంచాయతీ వార్ : నామినేషన్ వెయ్యకుండా అన్నంత పని చేసిన పూడూరు గ్రామస్తులు, ఫెయిల్ అయిన అధికారులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో తమ గ్రామం భాగస్వామ్యం తీసుకోకుండా ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న ఓ గ్రామం అన్నంత పని చేసింది. అధికారులు ఎంత ప్రయత్నం చేసినా ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయకుండా ప్రభుత్వంపై, ప్రజాప్రతినిధులపై తమ నిరసనను వ్యక్తం చేసింది. దీంతో ఆ గ్రామంలో ఎన్నికలు వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.

పూడూరులో గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయం
కర్నూలు జిల్లా కోడుమూరు పరిధిలోని పూడూరులో గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకొని, ఊరంతా చాటింపు వేయించారు. ఎవరు ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్న గ్రామస్తులు ప్రభుత్వంపై తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా పూడూరుకు చాలా కాలంగా రోడ్డు ప్రధాన సమస్యగా ఉంది. పూడూరు కు సమీపంలో ఇసుక రీచ్ ఉండడంతో రోడ్డు మొత్తం గుంతల మయంగా మారింది. ఆ రోడ్డును బాగు చేయాలని ఎంతమందికి విజ్ఞప్తి చేసినా వినిపించుకున్న దాఖలాలు లేవు.

రోడ్ వేసిన తర్వాత రండి ఆ తర్వాతనే ఎన్నికలు అంటూ అధికారులను తిప్పిపంపిన గ్రామస్తులు
రోడ్ సరిగ్గా లేని కారణంగా గ్రామంలో పలువురు అటువంటి సమయంలో ఆసుపత్రికి తరలించలేక మృత్యువాత పడ్డారు. ప్రజాప్రతినిధులకు అందరికీ విజ్ఞప్తి చేసినా గ్రామాన్ని పట్టించుకోకపోవడంతో ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న ఊరి ప్రజలు ఏకతాటి మీద ఆ నిర్ణయానికి కట్టుబడి ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయలేదు. తాము హెచ్చరించినట్టు అన్నంత పని చేశారు.
జిల్లా కలెక్టర్ సహా అధికారులంతా గ్రామస్తులను ఎన్నికల్లో పాల్గొనాలని బతిమాలారు. అయినప్పటికీ రోడ్ వేసిన తర్వాత రండి ఆ తర్వాతనే ఎన్నికలు అంటూ వారు అధికారులను సైతం వెనక్కి పంపించారు.

పంచాయతీ ఎన్నికలను టార్గెట్ చేసిన పూడూరు గ్రామస్థులు
రోడ్డు కోసం గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
పంచాయతీ ఎన్నికలను టార్గెట్ చేసిన గ్రామస్థులు, ఇప్పటికైనా ప్రభుత్వంలో, ప్రజాప్రతినిధులలో, అధికార యంత్రాంగంలో మార్పు వస్తుందని, రోడ్డును బాగు చేస్తారని ఆశాభావ దృక్పథంతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాలలో రోడ్డు కోసం ఆందోళనలు చేశారు. రోడ్లపైకి ఎవరూ రాకుండా ముళ్ళకంప అడ్డుపెట్టి తమ నిరసన తెలియజేశారు. గ్రామంలోకి వచ్చే ప్రజాప్రతినిధులను రోడ్డు కోసం నిలదీశారు. ఇంత జరిగినా ఫలితం మాత్రం శూన్యం.

రోడ్డు బాగు చేయలేని ఎన్నికలు మాకెందుకు అంటున్న గ్రామస్తులు .. ఎన్నికలు వాయిదా ?
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలను టార్గెట్ చేశారు. రోడ్డు బాగు చేయలేని ఎన్నికలు మాకెందుకు అంటూ ఊరి జనమంతా ఏకమై, ఎన్నికలను బహిష్కరించారు. పలు దఫాలుగా అధికారులు గ్రామస్తులతో చర్చలు జరిపినా గ్రామస్తులు ఏమాత్రం వినిపించుకోలేదు. ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో, ఎన్నికల్లో పాల్గొనబోమని చెప్పడంతో ఈ వ్యవహారాన్ని అధికారులు ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకువెళ్ళారు . దీంతో పూడూరు లో ఎన్నికలు వాయిదా పడే పరిస్థితి ఉందని భావిస్తున్నారు.