ఉమ్మడి కర్నూలులో వైసీపీ విభేదాలపై ఫోకస్- అంతా ఓకే..!!
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కారణమైన 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టారు ఉమ్మడి కర్నూలు జిల్లా ఓటర్లు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అప్పటి అధికార టీడీపీకి దక్కింది మూడే మూడు సీట్లంటే- ఇక్కడ వైఎస్ఆర్సీపీ హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

2019లో క్లీన్ స్వీప్..
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం ముందు తెలుగుదేశం పార్టీకి ఆ మూడు నియోజకవర్గాలు కూడా మిగల్లేదు. క్లీన్ స్వీప్ చేసేసింది వైఎస్ఆర్సీపీ. అధికార పార్టీ అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు ఒకటి.

విభేదాలపై..
అలాంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీలో విభేదాలు తలెత్తాయి. కర్నూలు, కోడుమూరు నియోజకవర్గాల్లో స్థానిక నాయకుల్లో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. కర్నూలులో శాసన సభ్యుడు మహ్మద్ హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి- కోడుమూరులో ఎమ్మెల్యే జరాదొడ్డి సుధాకర్, నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వర్గీయుల మధ్య భేదాభిప్రాయాలు తరచూ వ్యక్తమౌతూ వచ్చాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.

దృష్టి సారించిన హైకమాండ్..
కీలకమైన ఆ నియోజకవర్గాల్లో తలెత్తిన విభేదాలను అప్పటికప్పుడు పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇచ్చింది పార్టీ అగ్ర నాయకత్వం. హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డి వర్గ విభేధాలు వదిలి కలిసి పనిచేసేలా తక్షణ చర్యలు తీసుకున్నారు. వారతో సమావేశం అయ్యారు. రీజినల్ కో ఆర్డినేటర్లు ఆకెపాటి, రామసుబ్బారెడ్డి, అబ్జర్వర్లు రామయ్య, హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు.

క్రియాశీలకంగా ఎస్వీ
జిల్లాలో పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో ఎస్వీ మోహన్ రెడ్డి క్రియాశీలకంగా పాల్గొనాల్సి ఉంటుందని, ఆయన ప్రమేయం ఉండేలా హఫీజ్ ఖాన్ వర్గీయులు అంగీకరించారు. మూడు సంవత్సరాలుగా ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలకు కారణమైన అంశాల గురించి చర్చించారు. సచివాలయ కన్వీనర్ల నియామకాల్లో హఫీజ్ ఖాన్ కు మాత్రమే బాధ్యతలను అప్పగించినందుకు మొదట్లో ఎస్వీ మోహన్ రెడ్డి ఇబ్బంది పడినప్పటికీ- ఆ తరువాత ఆయన శాంతించారు. ఇకపై హఫీజ్ తో కలిసి కలిసి పనిచేయడానికి అంగీకరించారు.

కోడుమూరులోనూ..
కొడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులు గతంలో తమ మధ్య నెలకొన్న విభేధాలను పక్కన పెట్టి వచ్చే ఎన్నికల కోసం కలిసి పనిచేసేలా పార్టీ అగ్ర నాయకత్వం ఒప్పించింది. వన్ టు వన్ గా నిర్వహించిన భేటీలో ఈ ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. వాటన్నింటినీ పరిశీలనలోకి తీసుకున్న రీజినల్ కో ఆర్డినేటర్లు- అనంతరం వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భవిష్యత్తులో ఇద్దరూ కలిసి పనిచేసేలా ఒప్పించారు.












Click it and Unblock the Notifications