నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే అరుదైన ఘనత: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి..!
కర్నూలు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నందికొట్కూరు శాసన సభ్యులు తొగురు అర్థర్ అరుదైన ఘనతను సాధించారు. ఆయనకు అరుదైన గౌరవం లభించింది. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమలు చేసిన సమయంలో ఆయన తన నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవలకు ఈ గుర్తింపు దక్కింది. ఆయన చేసిన సేవలను లండన్‌లోని ప్రతిష్ఠాత్మక బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. కమిట్‌మెంట్ సర్టిఫికెట్‌ను అందజేసింది.
లాక్‌డౌన్ సమయంలో అర్థర్ తన నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం, కరోనా వైరస్ బారిన పడిన బాధితులు, వారి కుటుంబాలను స్వయంగా ఇళ్లు, ఆసుపత్రులు, ఐసొలేషన్ వార్డులకు వెళ్లి పరామర్శించడం వంటి చర్యలను లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. తన సొంత నిధులతో వ్యవసాయ కూలీలు, ఇతర రంగాలకు చెందిన కార్మికులకు అర్థర్ శానిటైజర్లు, మాస్కులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపింది.

ఈ సేవలను గుర్తించిన లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ సర్టిఫికెట్ ఆఫ్ కమిట్‌మెంట్ కోసం ఆయనను ఎంపిక చేసింది. స్విట్జర్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హెడ్ ఆఫ్ యూరప్ విల్హెమ్ జిగ్లార్.. ఈ సర్టిఫికెట్ కోసం అర్థర్‌ను ఎంపిక చేశారు. త్వరలో అర్థర్ సొంత నియోజకవర్గం నందికొట్కూరులో నిర్వహించబోయే కార్యక్రమంలో ఆయనను సన్మానిస్తారు. సర్టిఫికెట్ అందజేస్తారు. తనకు ఈ అరుదైన గుర్తింపు లభించడం పట్ల అర్థర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని తాను ప్రజలకు సేవలను అందించానని అన్నారు. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనడానికి వైఎస్ జగన్ అహర్నిశలు శ్రమించారని, అధికార పోలీసు యంత్రాంగాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించారని అన్నారు. ఎమ్మెల్యేలకు విలువైన సూచనలు చేశారని, వాటిని నూటికి నూరుశాతం అమలు చేశామని చెప్పారు. అందుకే తనకు ఈ గుర్తింపు లభించిందని, ఇది వైఎస్ జగన్ చలవేనని అన్నారు.
ముఖ్యమంత్రి సూచనల మేరకు తాను నిత్యం నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్నానని చెప్పారు. ప్రజల మధ్యే ఉంటూ కోవిడ్ నివారణకు కృషి చేశానని అన్నారు. తనకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ఈ గుర్తింపు వస్తుందని ఏ మాత్రం ఊహించలేదని అర్థర్ వ్యాఖ్యానించారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో అర్థర్.. నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన బండి జయరాజుపై 40,610 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.












Click it and Unblock the Notifications