మాకు 3 లక్షల కోట్ల నష్టం! ప్రభుత్వాలను కూల్చుతారా?: మోడీపై కేసీఆర్ ఘాటు విమర్శలు
మహబూబ్‌నగర్: కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు సీఎం కేసీఆర్. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రశ్నించిన ప్రభుత్వాన్ని పడగొట్టడమే మోడీ విధానమా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆయన ధ్వజమెత్తారు.

ప్రధాని మోడీకి 8 ఏళ్లు సరిపోలేదా?: కేసీఆర్
పాలమూరు ప్రాజెక్టులకు కేంద్రం సహకరించడం లేదని కేసీఆర్ ఆరోపించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏళ్లైనా కృష్ణా నదిలో నీటి వాటాలను తేల్చడం లేదని మండిపడ్డారు. అసమర్థ, చేతకాని ప్రభుత్వం అని కేంద్రంపై ధ్వజమెత్తారు. వాటా తేల్చేందుకు 8 ఏళ్లు సరిపోకపోతే అనుమతులు వచ్చేది ఎప్పుడు? అని ప్రశ్నించారు. కేంద్రం మనకు సహకరించడం లేదని చెప్పుకొచ్చారు. ఒకే జిల్లాకు వచ్చిన ప్రధాని.. హమ్ బనేంగే అని వ్యాఖ్యానించారని ఎద్దేవా చేశారు కేసీఆర్. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. దండం పెట్టిన.. 150 దరఖాస్తులు కూడా ఇచ్చానన్నారు. గెలిచినవాళ్లను సరిగా పనిచేయనివ్వాలన్నారు. మనల్ని పనిచేయనివ్వడం లేదని మండిపడ్డారు. ఆనాడు తెలంగాణ అనుకుంటే నిజమైందని.. దేశంలో కూడా నిజమవుతుందన్నారు. మేధావులు, యువత స్పందించాలని.. గ్రామాల్లో చర్చించాలన్నారు.
మోడీ సర్కారు వల్ల తెలంగాణకు 3 లక్షల కోట్ల నష్టమన్న కేసీఆర్
మోడీ ప్రభుత్వం కారణంగా తెలంగాణ రాష్ట్రం రూ. 3 లక్షల కోట్లు నష్టపోయిందన్నారు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉంటే తెలంగాణ జీఎస్‌డీపీ ఇంకా పెరిగి ఉండేదన్నారు. రైతులు అప్పుల్లేకుండా ఉంటేనే బంగారు తెలంగాణ అవుతుందన్నారు కేసీఆర్. ప్రధాని సొంత రాష్ట్రంలో కూడా తాగడానికి నీళ్లు లేవు, కరెంటు లేదని చెప్పుకొచ్చారు కేసీఆర్. స్వాతంత్ర్యం వచ్చి 74 ఏళ్లు అయినా దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు కోతలున్నాయని, నీరు లేదని అన్నారు. తెలంగాణలో ఇంటింటికి నీరు, ఉచిత కరెంటు, 24 గంటలపాటు విద్యుత్ సరఫరా ఉన్నట్లుగా.. కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా లేదని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఎరువులు దొరికేవి కాదని.. ఇప్పుడు ఆ సమస్య లేదన్నారు.

ప్రభుత్వాలను కూల్చుతారా? అంటూ మోడీపై కేసీఆర్ ఫైర్
కేంద్రంపై విమర్శలు చేస్తూ.. ఎఫ్ఆర్‌బీఎం కోతలు, బిల్లులు ఆపుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రధాని అడ్డుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ప్రధాని పదవిలో ఉండి ప్రభుత్వాలను పడగొడతామని ఎలా అంటారని మోడీపై ధ్వజమెత్తారు. మమతా బెనర్జీ సీఎంగా ఉన్న బెంగాల్‌లో 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ప్రధాని చెబుతారా? అని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్నది దిక్కుమాలిన రాజకీయాల కోసమేనా? అని నిలదీశారు. ఉద్యోగాలివ్వరు, ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్లకు అమ్ముతురు.. అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని కొందరు చిల్లరగాళ్ల గురించి అప్రమత్తంగా ఉండాలన్నారు.

హైదరాబాద్ వచ్చిన దొంగలను జైల్లో పెట్టామన్న కేసీఆర్
ఉన్మాదం, భావోద్వేగాలు రెచ్చొడుతూ ప్రజల మధ్య చిచ్చుపెడుతోందంటూ బీజేపీపై కేసీఆర్ విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ కు కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వచ్చిన దొంగలను జైళ్లో పెట్టామని చెప్పారు. మనకెందుకులే అన్నట్లుగా ఉండొద్దు.. బెబ్బులిలా దెబ్బ కొట్టాలన్నారు. వారంలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తామని చెప్పారు. కాలువల పనికూడా మొదలుపెడతామన్నారు.

పాలమూరుకు కేసీఆర్ వరాలు.. బీఆర్ఎస్ అంటూ జై భారత్
తనను ఎంపీగా గెలిపించిన పాలమూరు అన్ని నిజయోజకవర్గాలకు కలిపి 260 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో నియోజకవర్గానికి అదనంగా 1000 ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అద్భుతమైన పాలమూరు చేస్తున్నామన్నారు. ఐదు మెడికల్ కాలేజీలు జిల్లాకు వచ్చాయన్నారు. నీళ్లు తెచ్చిన నిరంజన్ రెడ్డిని నీళ్ల నిరంజన్ రెడ్డి అంటున్నారని కేసీఆర్ చెప్పారు. మీతో ఉంటా.. మాతో ఉండండి అని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలా దేశాన్ని కూడా బాగు చేసుకుందామన్నారు. ప్రజలు అనుమిస్తూ బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తుందన్నారు. తెలంగాణలోలానే జాతీయ జాతీయ రాజకీయాల్లోనూ గట్టిగా చూద్దామా? అని అన్నారు. జై భారత్.. జై తెలంగాణ అంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.












Click it and Unblock the Notifications