నలుగురు అక్కాచెల్లెళ్ల సూసైడ్ అటెంప్ట్.. జడ్చర్లలో కలకలం
జడ్చర్ల : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో కలకలం రేగింది. నలుగురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడం చర్చానీయాంశమైంది. గురువారం నాడు జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
ఒక కుటుంబంలో ఆరుగురు ఆడపిల్లలున్నారు. ఇంకా ఎవరికీ వివాహం కాలేదు. అయితే అందులో ఒక అమ్మాయి బుధవారం నాటి నుంచి కనిపించడం లేదు. ఆమె గురించి రోజంతా వెళ్లినా ప్రయోజనం కన్పించలేదు. ఆ యువతి జాడ దొరకక కుటుంబ సభ్యులు తీరని వేదనకు గురయ్యారు. చివరకు ఓ యువకుడితో సదరు యువతి వెళ్లినట్లు తెలిసింది.

దాంతో ఆ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. తమకన్నా చిన్నదైన చెల్లె ఇంటి నుంచి అలా వెళ్లిపోవడం నలుగురు అక్కలు జీర్ణించుకోలేకపోయారు. కుటుంబం పరువు పోయిందని కలత చెందారు. ఆ క్రమంలో ఆ నలుగురు పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశారు. అయితే వారు ఆత్మహత్య చేసుకున్న సమయంలో అడ్డురాకుండా ఉండేందుకు చిన్న చెల్లెను, తల్లిని వేరే గదిలో ఉంచి గొళ్లెం వేశారు.
తలుపు తీయాలని ఆ ఇద్దరూ ఎంత అరిచినా వారు వినిపించుకోలేదు. చివరకు ఎలాగోలా ఆ గది నుంచి బయటపడి వీధిలోకి వచ్చి కేకలు వేయడంతో స్థానికులు పోగయ్యారు. అప్పటికే ఆ నలుగురు పురుగుల మందు సేవించడంతో వారిని బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications