నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు కరోనా పాజిటివ్...
నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కరోనా బారినపడ్డారు. కరోనా అనుమానిత లక్షణాలతో టెస్టులు చేయించుకున్న ఆయనకు పాజిటివ్‌గా నిర్దారణ అయింది. నెలన్నర క్రితమే ఆయన కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోసు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ కరోనా బారినపడటం గమనార్హం. కరోనా సోకడంతో ఇటీవల తనను కలిసినవారంతా టెస్టులు చేయించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలోనే ఆయన క్వారంటైన్‌లో ఉంటున్నారు.
ఇక రాష్ట్రంలో కొత్తగా 784 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,28,282కి చేరింది. మరో ఐదుగురు కరోనాతో చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 3703కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,455 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 1028 మంది కరోనా నుంచి కోలుకున్నారు.ఇప్పటివరకూ మొత్తం 6,13,124 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,05,186 శాంపిళ్లను పరీక్షించగా మొత్తంగా 1,92,74,985 శాంపిళ్లను పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాతో సంభవిస్తున్న మరణాల రేటు జాతీయ స్థాయిలో 1.3శాతం ఉండగా తెలంగాణలో కేవలం 0.58శాతం ఉంది. రికవరీ రేటు జాతీయ స్థాయిలో 97.14శాతం ఉండగా రాష్ట్రంలో 97.58శాతం ఉంది.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ విధించగా జూన్ 20 నుంచి అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని రకాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.కోవిడ్ ఉద్ధృతి తగ్గడం,పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తివేసింది. లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్కులు,భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని చెబుతోంది.
ఇక రాష్ట్రంలో జులై 1 నుంచి విద్యా సంస్థలను పున:ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ... థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసులకే పరిమితం కావాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications