నెల్లూరులో దారుణం-బాలికతో వెట్టిచాకిరీ- చోద్యం చూసిన కానిస్టేబుల్ కు మెమో...
నెల్లూరు జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ జవాబు పత్రాల వ్యాల్యూషన్ కోసం చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా ఓ కాలేజీలోని క్లాస్ రూమ్ లో ఆరేళ్ల బాలికతో వెట్టిచాకిరీ చేయించిన ఘటన బయటపడింది. వాచ్ మెన్ కూతురైన ఆరేళ్ల బాలికతో గదులను శుభ్రం చేయిస్తున్న దృశ్యాలు బయటికి రావడంతో డీజీపీ గౌతం సవాంగ్ సీరియస్ అయ్యారు. ఈ ఘటన జరుగుతున్నప్పుడు అక్కడే ఉండే బాలికను అడ్డుకోకుండా చోద్యం చూసిన కానిస్టేబుల్ కు ఛార్జి మెమో జారీ చేశారు.
Recommended Video
నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఓ కళాశాలలో గదులను ఇంటర్మీడియట్ పరీక్షాపత్రాల మూల్యాంకనం కోసం సిద్ధం చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా మూసి ఉంచిన గదుల్లో దుమ్ము చేరడంతో వాటిని శుభ్రం చేస్తున్నారు. ఇదే క్రమంలో వాచ్ మెన్ తన ఆరేళ్ల కూతురిని తనకు బదులుగా శుభ్రం చేసేందుకు పంపాడు. పోలీసుల సమక్షంలో బాలిక గదులను నీటితో శుభ్రం చేస్తోంది. ఈ దృశ్యాలు చూసిన వారంతా అవాక్కయ్యారు. పసిపిల్లలతో వెట్టిచాకిరీ చేయించకుండా నిబంధనలు, చట్టాలు ఉన్నప్పటికీ వాచ్ మెన్ తన కూతురిని పనిలోకి పంపడం, పోలీసులు అక్కడే ఉండి దాన్ని ప్రోత్సహించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

ఘటనపై స్పందించిన డీజీపీ గౌతం సవాంగ్.. ఆత్మకూరు కళాశాలల లో గదిని శుభ్రం చేస్తున్న దృశ్యాలు హృదయాన్ని కలచి వేశాయని, వాచ్ మెన్ తన పనిని కూతురు చేత చేయించడం కూడా చట్టరీత్యా నేరమేనని డీజీపీ తెలిపారు. ఈ ఘటన ను అడ్డుకోవాల్సిన కానిస్టేబుల్ ప్రేక్షక పాత్ర వహించడం పై శాఖాపరమైన విచారణ చేపట్టాలని నెల్లూరు ఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు.
ఆపరేషన్ ముస్కాన్ పేరుతో అనేక మంది బాలబాలికలకు ఓ పక్క నుండి విముక్తి కల్పిస్తుంటే..మరో పక్క ఈ ఘటన జరగడం దురదృష్టకరమని డీజీపీ సవాంగ్ వ్యాఖ్యానించారు.
కళాశాల యాజమాన్యంపైనా దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications