జగన్ సర్కార్ గుడ్‌న్యూస్- 43 వేల ఎకరాల చుక్కల భూములపై- నెల్లూరు జిల్లాలో..!!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టినట్టే. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో జనం మధ్యే గడపడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోన్నారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ, పార్టీ యంత్రాంగాలను పరుగులెత్తిస్తోన్నారు.
ఇటీవలే విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించారు. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను ఆవిష్కరించారు. విశాఖపట్నంలో అదాని డేటా సెంటర్, వైజాగ్ ఐటీ టెక్ పార్క్ నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు.

తాజాగా నెల్లూరు జిల్లా పర్యటనకు ఆయన బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 12వ తేదీన వైఎస్ జగన్ కావలిలో పర్యటించనున్నారు. బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పర్యటన సందర్భంగా- చుక్కల భూముల పట్టాలను రైతులకు పంపిణీ చేయనున్నారు. గతంలో చుక్కల భూముల సమస్యలను ప్రభుత్వ పరిష్కరించిన విషయం తెలిసిందే. దీనికోసం ప్రత్యేకంగా జీఓ తీసుకొచ్చింది ప్రభుత్వం.
కావలి నియోజకవర్గం పరిధిలో సుమారు 6,000 ఎకరాల వరకు చుక్కల భూములు ఉండేవి. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ వల్ల చుక్కల సమస్య తొలగిపోయింది. ఈ నేపథ్యంలో- అదే నియోజకవర్గంలో వైఎస్ జగన్- ఈ భూములను రైతులకు పంపిణీ చేయనున్నారు. అక్కడే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యక్రమాల కన్వీనర్, శాసన మండలి సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి పరిశీలించారు.
కావలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చుక్కల భూముల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానిక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. చుక్కల భూములను పరిష్కరించడానికి జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చిందని గుర్తు చేశారు.
ఈ జీఓను తీసుకుని రావడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 43,000 ఎకరాల మేర చుక్కల భూముల సమస్యకు పరిష్కారం లభించిందని అన్నారు. చుక్కలను తొలగించాన్ని వేలాది రైతు కుటుంబాలు స్వాగతిస్తోన్నాయని పేర్కొన్నారు. తన నియోజకవర్గం పరిధిలోనే సుమారు 6,000 ఎకరాల చుక్కుల భూములు ఉండేవని పేర్కొన్నారు. ఆ సమస్య తొలగిపోవడం వల్ల- వాటిని వైఎస్ జగన్ రైతులకు పంపిణీ చేయనున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications