నెల్లూరు ఎస్పీపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న బూతుపురాణం- అట్రాసిటీ కేసు పెట్టలేదని- తీవ్రవ్యాఖ్యలు
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల అరాచకం మరోసారి బయటపడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్దానాలు గెల్చుకున్న ధీమాతో ప్రతిపక్ష టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలు.. దీనికి అడ్డుపడుతున్న అధికారులను వదలడం లేదు. గతంలోనూ ఇదే జరగగా... తాజాగా మరోసారి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఏకంగా ఎస్పీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఎస్పీ భాస్కర్ భూషణ్‌ను ఉద్దేశించి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

నెల్లూరు ఎస్పీ వర్సెస్ కోవూరు ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లాలో వైసీపీ పూర్తిస్ధాయిలో బలంగా ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలో పదికి పది ఎమ్మెల్యే స్ధానాలతో పాటు ఎంపీ స్ధానాన్ని కూడా గెల్చుకున్న వైసీపీ తనకు అనుకూలంగా ఉండే అధికారులను జిల్లాలో నియమించుకుని ఏకపక్ష రాజకీయాలు చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విపక్ష టీడీపీ నేతల ఫిర్యాదులకు ఎస్పీ భాస్కర్ భూషణ్ స్పందించడంతో రాజకీయం వేడెక్కింది. శాంతిభద్రతలను కాపాడేందుకు ఎస్పీ చేస్తున్న ప్రయత్నాలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదే కోవలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి నెల్లూరు ఎస్పీపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.

టీడీపీ ఏజెంటువా ? మా అధికారివా
జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ చలపతిరావుతో పాటు పలువురు వైసీపీ నేతలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని అధికార పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎస్పీ మాత్రం సోషల్ మీడియా పోస్టులకు వర్తించే కేసులు మాత్రమే పెట్టి వదిలేయడంపై ఎమ్మెల్యే ప్రసన్న మండిపడ్డారు. నువ్వు టీడీపీ ఏజెంటువా, మా ప్రభుత్వం తెచ్చిపెట్టుకున్న జిల్లా అధికారివా అంటూ ప్రసన్న.. ఎస్పీ భాస్కర్ భూషణ్‌పై నిప్పులు చెరిగారు. జిల్లా నేతపై పోస్టులు పెడితే జిల్లా అధికారి అట్రాసిటీ కేసు పెట్టొద్దని అంటావా, 13 జిల్లాల్లో ఇలాగే జరుగుతోందా అని ప్రశ్నించారు. అట్రాసిటీ కేసులు ఎస్పీ అనుమతి లేనిదే పెట్టకూడదా ఎవరు నేర్చించారు నీకు రూల్స్ అంటూ ప్రసన్న రెచ్చిపోయారు.

నెల ఉంటావో రెండు నెలలు ఉంటావో
జిల్లాలో నెల రోజులు ఉంటావో, రెండు నెలలు ఉంటావో తెలియదు, ఉన్నన్ని రోజులు మంచి పేరు తెచ్చుకుని వెళ్లిపో అంటూ ఎమ్మెల్యే ప్రసన్న ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నాతో పెట్టుకోకు, హైదరాబాద్‌లో, విజయవాడలో డీజీపీ కాపాడతాడనుకుంటున్నావా అంటూ బెదిరింపులకు కూడా దిగారు. టీడీపీ మాజీ మంత్రి ఫోన్ చేస్తే స్పందిస్తావా ? ఎన్నిరోజులుంటావ్ జిల్లాలో అని ఎస్పీని ప్రశ్నించారు. తర్వాత నీ బతుకేంది, వేరే జిల్లాకు వెళ్లిపోతావన్నారు. కేసు నమోదు చేయవద్దనడానికి నువ్వెవరు, ఏమనుకుంటున్నావు, ఎవరనుకుంటున్నావు, ఏ ప్రభుత్వం అనుకుంటున్నావు, తమాషాలు పడొద్దంటూ హెచ్చరికలు చేశారు.

నీకు దమ్ముంటే అరెస్టు చేయించు
అట్రాసిటీ కేసు పెట్టేందుకు సిద్ధమైన కింది స్ధాయి పోలీసులను జైల్లో వేయిస్తానని ఎస్పీ బెదిరించారంటూ ఎమ్మెల్యే ప్రసన్న ఆరోపించారు. బెదిరిస్తావా, జైల్లో వేయిస్తానని డిపార్ట్‌మెంట్‌లో కింద వాళ్లకు చెప్తావా ? నీలా నేను పిచ్చి వ్యవహారాలు చేయనని, తన వాళ్ల పక్కన నిలబడతానని అన్నారు. స్ధానిక ఎస్సై, సీఐ, డీఎస్పీ పక్కన తాను ఉంటానని, నీకు దమ్ముంటే వారిని అరెస్టు చేయించాలని ఎస్పీని కోవూరు ఎమ్మెల్యే సవాల్ విసిరారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.