ఒంగోలు రచ్చ రచ్చే
Ongole Assembly constituency roundup: ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం మరోసారి హైఓల్టేజ్ పోరు నెలకొంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, తెలుగుదేశం నుంచి దామచర్ల జనార్దన్ రావు పోటీ పడుతున్నారు. విజయం ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠభరితంగా మారిన స్థానాల్లో ఇదీ ఒకటి.
ఒంగోలు లోక్‌సభ పరిధిలోని జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇది. ఒంగోలు, కొత్తపట్నం మండలాలు దీని పరిధిలో ఉంటాయి. 2,29,317 మంది ఓటర్లు ఉన్నారిక్కడ. సంఖ్యాపరంగా గానీ, రాజకీయపరంగా గానీ కమ్మ, కాపు, రెడ్డి సామాజిక వర్గీయులదే ఆధిపత్యం. యాదవులు, వైశ్య సామాజిక వర్గాల ఓటుబ్యాంకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుంది.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు ఆరు ఎన్నికలు జరిగాయి. 1952లో సీపీఐ, 1957,1962లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఆ తరువాత వరుసగా 1967, 1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పాగా వేసింది ఒంగోలులో. టీడీపీ ఆవిర్భవించిన తరువాత ఆ పార్టీ పట్టు సాధించింది. కాంగ్రెస్‌కు ధీటుగా నిలిచింది. కాంగ్రెస్, టీడీపీ నాలుగు సార్లు చొప్పున గెలిచాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు విజయం సాధించింది. అటు కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డే విజయఢంకా మోగించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్ధిగా బాలినేని.. టీడీపీ తరఫున పోటీ చేసిన ఈదర హరిబాబుపై 22,986 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. 2012 ఉప ఎన్నికలో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా కూడా విజయం సాధించారు బాలినేని.
2014లో టీడీపీ అభ్యర్ధి దామచర్ల జనార్ధనరావు చేతిలో 12,428 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారాయన. మళ్లీ 2019లో పట్టు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంపై పట్టు సాధించగలిగారు. అదే దామచర్లపై మరోసారి 22,245 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో కూడా వారిద్దరే పోటీ పడుతున్నారా రెండు పార్టీల నుంచి. ఈ పోరు ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది.












Click it and Unblock the Notifications