అక్కడ వైసీపీని ఢీ కొట్టేదెవరు?
Darsi Assembly round up 2024: ఈ ఎన్నికల సంగ్రామంలో ఆసక్తి కలిగించే అసెంబ్లీ నియోజకవర్గం.. దర్శి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. క్రమంగా అక్కడ కాంగ్రెస్ పాగా వేసింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతోంది. ఈ ఎన్నికల్లో ఇక్కడ గెలుపెవరిదనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.
ఒంగోలు లోక్‌సభ పరిధిలోని జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం.. దర్శి. తాళ్లూరు, కురిచేడు, ముండ్లమూరు, దర్శి, దొనకొండ మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. 2,14,233 మంది ఓటర్లు ఉన్నారు. సంఖ్యాపరంగా గానీ, రాజకీయంగా గానీ రెడ్డి సామాజిక వర్గీయుల ఆధిక్యత కొనసాగుతుంటుంది. కాపు, కమ్మ సామాజిక వర్గీయుల ఓటు బ్యాంకు భారీగా ఉంది. ఎస్సీ, యాదవులు, ముస్లిం, వైశ్య కులాలు వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు.

రాజకీయంగా వైశ్య సామాజిక వర్గీయులు కీలకంగా వ్యవహరించే నియోజకవర్గాలలో దర్శి కూడా ఒకటి. గతంలో నాలుగుసార్లు వైశ్యులు ఇక్కడ విజయం సాధించడమే దీనికి నిదర్శనం. టీడీపీ ఆవిర్భవించక ముందు ఆరుసార్లు ఎన్నికలు జరిగాయి. నాలుగు సార్లు కాంగ్రెస్ , ఒకసారి స్వతంత్ర పార్టీ, మరోసారి సీపీఐ గెలిచింది.
టీడీపీ ఆవిర్భవించిన తరువాత అంటే 1983 నుంచి 2019 వరకు 10 సార్లు ఎన్నికలు జరిగ్గా.. ఆ పార్టీనే పైచేయి సాధించింది. మూడు సార్లు కాంగ్రెస్, ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తొలిసారిగా వైఎస్ఆర్సీపీ దీన్నిదక్కించుకోగలిగింది.
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి బూచేపల్లి శివప్రసాదరెడ్డి గెలిచారు. టీడీపీకి చెందిన మన్నం వెంకటరమణపై 13,390 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసిన శిద్దా రాఘవరావు.. అదే బూచేపల్లిపై 1,374 స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పట్లో చంద్రబాబు మంత్రివర్గంలో బెర్త్ సంపాదించారు
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన మద్దిశెట్టి వేణుగోపాల్ భారీ మెజారిటీతో టీడీపీకి చెందిన కదిరి బాబూరావుపై విజయఢంకా మోగించారు. మద్దిశెట్టి వేణుగోపాల్.. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి మూడోస్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మరోసారి బూచేపల్లికి అవకాశం ఇచ్చింది. టీడీపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడున్న కాపు ఓటుబ్యాంకును దృష్టిలో పెట్టుకుని జనసేనకు ఈ సీటును కేటాయిస్తుందనే ప్రచారం ఉంది.












Click it and Unblock the Notifications