పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తే...చంద్రబాబు నల్లిని నలిపినట్లు నలిపేస్తారు:గన్ని కృష్ణ
తూర్పుగోదావరి:జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై టిడిపి నేత, గోదావరి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (గుడా) ఛైర్మన్ గన్ని కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అశాంతి నెలకొనేలా ప్రయత్నిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను చూస్తూ ఊరుకోరని...నల్లిని నలిపినట్లు నలిపేస్తారని గుడా చైర్మన్ గన్ని కృష్ణ వ్యాఖ్యానించారు. రాజమండ్రిలోని ఒక డివిజన్ లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమానికి హాజరైన గన్ని కృష్ణ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే...

పవన్ వార్నింగ్ లు...సరికాదు
రాజమండ్రిలోని 12వ డివిజన్‌లో స్థానిక టీడీపీ ఇన్‌ఛార్జి కీర్తి శ్రీను ఆధ్వర్యంలో నగర దర్శిని కార్యక్రమంలో గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ పాల్గొన్నారు. తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో గన్ని కృష్ణ మాట్లాడారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తనకు ఏమి జరిగినా డీజీపీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్‌లే బాధ్యులన్నట్టుగా మాట్లాడటం...వారికి వార్నింగ్‌లు ఇవ్వడం సరికాదని గన్ని కృష్ణ హెచ్చరించారు.

కోనసీమలో...ఐదు రోజులు
ఇదిలావుంటే మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపోరాటయాత్ర నేటి నుంచి కోన సీమలో ప్రారంభంకానుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఏర్పాటు చేసే పలు బహిరంగ సభల్లో పాల్గోనున్నట్లు తెలిసింది. కోనసీమలో పవన్ తొలి బహిరంగ సభ ఆదివారం సాయంత్రం రావులపాలెం కళావెంకట్రావు విగ్రహం సమీపాన కొత్తపేట నియోజకవర్గస్థాయి లో జరగనున్నట్లు సమాచారం.

షెడ్యూల్...ఇలా ఉండొచ్చు
పవన్ బహిరంగ సభ జరగనుందని తెలిసి ఇప్పటికే ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇక్కడకు తరలివస్తుండటంతో భారీ జనసందోహం రాకకు అనుగుణంగా సభావేదిక, ప్రాంగణం, ఇతర ఏర్పాట్లలో నిర్వాహకులు తలమునకలుగా ఉన్నారు. పవన్ పర్యటన షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించనప్పటికీ 26న పి.గన్నవరం, 27న రాజోలు, 28న ముమ్మిడివరం, 29న అమలాపురంలో ఆయన ప్రజాపోరాట యాత్ర జరగనున్నట్లు తెలుస్తోంది.

గ్రూపులతో...ఆందోళన
ఇదిలావుంటే 26 న పి.గన్నవరంకు పవన్ రాక సందర్భంగా ఏర్పాట్లు గురించి చర్చించేందుకు జనసేన నేతలు శనివారం రెండు గ్రూపులుగా వేర్వేరు సమావేశాలు నిర్వహించడం కార్యకర్తలను గందరగోళానికి గురిచేసినట్లు తెలిసింది. అత్యంత కీలకమైన ఈ తరుణంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం పార్టీకి నష్టం కలిగిస్తాయని పవన్ అభిమానులు, మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications