పోలవరంలో మరో కీలక ఘట్టం- స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులకు శ్రీకారం
ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. ప్రాజెక్టును ఎట్టిపరిస్ధితుల్లోనూ ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం, నిర్మాణ సంస్ధ మేఘా ఇంజనీరింగ్ ఇవాళ ఈ దిశగా మరో ముందడుగు వేశాయి.. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులను ఇవాళ ప్రారంభించారు.
పోలవరం చక చకా- ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు ప్రారంభం- శాంతించిన గోదారి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగిపోతోంది. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్ ఛానల్ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. జలవనరులశాఖ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ సంస్ధ నిపుణుల పర్యవేక్షణలో ఇవాళ స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులను మొదలుపెట్టారు. గతేడాది జూలైలో వచ్చిన వరదలకు స్పిల్ ఛానల్ మట్టి, కాంక్రీట్ పనులు నిలిచిపోయాయి. దాదాపు 3 టీఎంసీలకు పైగా వరదనీరు ప్రాజెక్టును దాటుకుంటూ వెళ్లింది. దీంతో పనులకు తీవ్ర అంతరాయం కలిగింది. గత నవంబర్‌లో వరద కాస్త తగ్గడంతో నీటిని తోడటం మొదలుపెట్టారు. 70 భారీ పంపులను ఏర్పాటు చేసి 2.5 టీఎంసీల నీటిని తోడేశారు. దీంతో పనులు ప్రారంభమయ్యాయి.

స్పిల్ ఛానల్లో ఇప్పటివరకూ మట్టి తవ్వకం పనులు, అంతర్గత రహదారుల నిర్మాణం మొదలైంది. ఇప్పటివరకూ లక్షా పది వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తయ్యాయి. మిగిలిన మట్టి తవ్వకంతో పాటు కాంక్రీట్ నిర్మాణ పనులు ఇవాళ మొదలయ్యాయి.
ఈ ఏడాది జూన్ వరకూ ఈ కాంక్రీట్ పనులు పూర్తయితే స్పిల్ ఛానల్ నిర్మాణం పూర్తయినట్లే. మిగతా పనులను డిసెంబర్ కల్లా పూర్తి చేస్తే ప్రాజెక్టు పూర్తయినట్లేనని భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఖరీప్ సీజన్ అంటే జూలై నాటికి పోలవరం ప్రాజెక్టు ద్వారా పొలాలకు నీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.