" షా" బౌన్సర్‌కు డగౌట్‌లో గంగూలీ...!
సౌరవ్ గంగూలీ... క్రికెట్ క్రీడతో పరిచయం ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు. టీమిండియా కెప్టెన్‌గా ఒక వెలుగు వెలుగొందాడు. తన నిర్ణయాలతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల సామర్థ్యం ఉన్న నాయకుడు గంగూలి. ఇప్పటి వరకు టీమిండియాకు బెస్ట్ కెప్టెన్స్ ఎవరంటే కచ్చితంగా గంగూలీ పేరు వినిపిస్తుంది.మైదానంలో బెంగాల్ టైగర్‌లా రెచ్చిపోయే గంగూలీ మైదానం బయట చాలా సౌమ్యుడిగా కనిపిస్తారు.
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాకా గంగూలీ క్రీడతో పూర్తిగా సంబంధాలు తెంచుకోలేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 35వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. 2019 అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు ఈ పదవిలో ఉన్నారు.గతేడాది ఐపీఎల్ సందర్భంగా టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్‌కు స్వయంగా గంగూలీ, జైషాలు ట్రోఫీని అందించారు. కానీ ఏడాదిలోనే బండ్లు ఓడలయ్యాయి, ఓడలు బండ్లుగా మారాయి. గంగూలీ పరిస్థితి కూడా అంతే.

ఒకప్పుడు ఎన్నో గొప్ప పదవులను అధిష్టించిన గంగూలీ ఇప్పుడు ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ డౌగౌట్‌లో మెంటార్‌గా కనిపిస్తున్నాడు. ఇది చూసిన చాలామంది అభిమానులకు మింగుడు పడటం లేదు. అసలు ఈ పరిస్థితి గంగూలీకి ఎందుకొచ్చిందనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది. గంగూలీ రాజకీయ చట్రంలో చిక్కుక్కున్నాడనే వాదన వినిపిస్తోంది. ఇక గంగూలీకి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది..?
గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనయుడు జైషా బీసీసీఐ ట్రెజరర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గతేడాది గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ టైటిల్ సాధించినప్పుడు గంగూలీ, జైషాలు కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు ట్రోఫీని అందజేశారు. కానీ ఏడాదిలోనే ఎవరూ ఊహించని మార్పులు జరిగిపోయాయి. ఈ తరం వారికి అంతగా పరిచయంలేని పేరు రోజర్ బిన్నీని బీసీసీఐ అధ్యక్షుడిగా నియమించారు. ఇక గంగూలీ డగౌట్‌కు పరిమితమయ్యాడు.

అయితే దీనివెనక రాజకీయ కోణం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో అమిత్ షా గంగూలీ నివాసంకు రెండు సార్లు వెళ్లారు. రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. బీజేపీలో మంచి స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ దాదా మాత్రం పొలిటికల్ ఎంట్రీకి నో అని కరాకండిగా చెప్పేశారు. ఇక అప్పటి నుంచే దాదాకు కష్టాలు ప్రారంభమయ్యాయని ప్రచారం జరిగింది.
బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ రావడం, గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా వెళ్లిపోవడం వేగంగా జరిగాయి. కానీ జైషా పదవిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.మొత్తానికి ఇండియన్ క్రికెట్‌లో బెంగాల్ టైగర్‌లా రాజసం ప్రదర్శించిన దాదా పరిస్థితి డౌగౌట్‌కు చేరుకుంది. అది క్రీడా స్ఫూర్తి అని అభినందించాలా లేక అమిత్ షా పొలిటికల్ గేమ్‌లో గంగూలీ బలైనందుకు జాలిపడాలో అర్థంకాని పరిస్థితి అభిమానుల్లో ఉంది.












Click it and Unblock the Notifications