హైదరాబాద్‌లో 100 వ్యాక్సిన్ కేంద్రాలు: త్వరలో టెస్టింగ్ సెంటర్ వస్తుందన్న కేంద్రమంత్రి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా టీకాలు వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు.
ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టీకా సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ ఉచితంగా కరోనా టీకా వేస్తామన్నారు. కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని కేంద్రానికి వెళితే వేచి చూడాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రజలు తమ దగ్గర్లో ఉన్న కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని పురపాలక శాఖ కార్యదర్శి తెలిపారు.

హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్
మరో నెల రోజుల్లో హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పీఎం కేర్స్ నిధులతో ఈ టెస్టింగ్ సెంటర్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశంలో కేవలం రెండు వ్యాక్సిన్ టెస్టింగ్ కేంద్రాలే ఉన్నాయన్నారు.
ఇప్పుడు హైదరాబాద్‌లో మూడో వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు కాబోతోందని కేంద్రమంత్రి తెలిపారు. ఫార్మా, పరిశోధన సంస్థలకు భాగ్యనగరం కేంద్రంగా ఉందని చెప్పారు. ఇప్పుడు కొత్తగా వచ్చే వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ హైదరాబాద్‌కు తలమానికం అవుతుందన్నారు. టీకా టెస్టింగ్ సెంటర్‌కు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications