తెలంగాణలో కొత్తగా 1061 కరోనా కేసులు: 21వేలకు దిగొచ్చిన యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 69,892 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 1061 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,79,971కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
జీహెచ్ఎంసీ పరిధిలో 274 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనా బారినపడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 4102కు చేరింది. కరోనా బారి నుంచి సోమవారం 3590 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21,470 యాక్టివ్ కేసులున్నాయి.

ఇది ఇలావుండగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని, కోవిడ్ థర్డ్ వేవ్ కూడా ముగిసిందని తెలంగాణ వైద్యాధికారి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మూడో వేవ్ ముగిసిందని, ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అవసరం లేదని అభిప్రాయపడ్డారు డీహెచ్ శ్రీనివాసరావు. కరోనా మూడు వేవ్‌ల రూపంలో ప్రపంచాన్ని వణికించిందని, తెలంగాణలో కరోనా పాజిటివీటి రేటు ఇప్పుడు రెండు శాతంగానే ఉందని తెలిపారు.
తెలంగాణ ప్రజలంతా ఊపిరిపీల్చుకునే సమయం వచ్చేసిందని డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఫస్ట్ వేవ్ 10 నెలలు, సెకండ్ వేవ్ 6 నెలలు, థర్డ్ వేవ్ మూడు నెలలు మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఇక నుంచి ఎటువంటి ఆంక్షలు లేవని, కేంద్రం కూడా ఆంక్షలు ఎత్తివేసిందని డీహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు.
ఐటీ ఉద్యోగులు కూడా ఇకపై వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యాల్సిన అవసరం లేదని డీహెచ్ అన్నారు. ఇక ముందు కూడా ఎన్ని వేరియంట్లు వచ్చినా ఎదుర్కోగలమనే ధీమా వ్యక్తం చేశారు. ఇప్పట్లో కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం కూడా లేదని ప్రజలు నిర్భయంగా ఉండొచ్చని ఆయన భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications