చలి వాగులో చిక్కుకున్న 12 మంది రైతులు.. హెలికాఫ్టర్ ద్వారా కాపాడే యత్నం .. వాగులో బస్సు , లారీ కూడా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ వర్షాల దెబ్బకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. శనివారం టేకుమట్ల మండలం కుందన పల్లి గ్రామం వద్ద చలి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డుపై నుండి ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించారు 12 మంది రైతులు. దీంతో 12 మంది రైతులు చలివాగు నీటి ప్రవాహంలో చిక్కుకు పోయారు.
Recommended Video
పోలీసులు రెస్క్యూ టీం వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, ఆ ప్రయత్నాలు సఫలం కావడం లేదు. వాగు ఉధృతంగా ఉండడంతో వారిని రెస్క్యూ టీం కాపాడడంలో ఇబ్బంది తలెత్తుతోంది. అక్కడి పరిస్థితిని తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ రైతులు కాపాడడం కోసం ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి , చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ లతో ఫోన్లో మాట్లాడి ఒక హెలికాఫ్టర్ ను సంఘటన స్థలానికి పంపించాలని సూచించారు .మరికొద్ది సేపట్లో సంఘటన స్థలానికి హెలికాప్టర్ చేరుకుని రైతులను కాపాడనున్నట్లుగా తెలుస్తోంది.

మరోపక్క కంఠాత్మకూరు గ్రామం వద్ద లోలెవెల్ వంతెన మీదుగా వరద ప్రవాహం ఉదృతంగా కొనసాగుతోంది .అయితే శుక్రవారం రాత్రి ఈ బస్సు వరదల్లో చిక్కుకున్న ట్లుగా తెలుస్తుంది. బస్సులోని వారంతా సురక్షితంగా బయటపడగా వర్షం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న ఉధృతికి బస్సు కొట్టుకుపోయేలా కనిపిస్తోంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ లో వాగులో లారీ కొట్టుకుని పోయిన ఘటన చోటుచేసుకుంది .ఈ ఘటనలో లారీ డ్రైవర్ శంకర్ గల్లంతయ్యాడు. శంకర్ ని కాపాడడానికి రెస్క్యూ టీం ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదు. దీంతో శంకర్ వరద ప్రవాహం లో కొట్టుకుపోయినట్లు గా తెలుస్తోంది. గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి శంకర్ కోసం గాలింపు చేపట్టారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తుతం శంకర్ ఆచూకీ కోసం ఆందోళనలో ఉన్నారు.

చలి వాగులో చిక్కుకున్న 12 మంది రైతులు.. హెలికాఫ్టర్ ద్వారా కాపాడే యత్నం#Telangana #rains #chalivagu pic.twitter.com/LtY1T0WLsK
— oneindiatelugu (@oneindiatelugu) August 15, 2020












Click it and Unblock the Notifications