15ఏళ్ళ బాలిక సాహసయాత్ర: 5వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ ప్రయాస; ఎందుకో తెలుసా!!
తెలంగాణ రాష్ట్రంలోని ఓ బాలిక భూమిని కాపాడడం కోసం ఎవరూ తీసుకోని ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే కాలంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుందని గుర్తించిన బాలిక ఇప్పటి నుంచి భూమిని కాపాడాలని, భూసారాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని ప్రజలందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ పదిహేను సంవత్సరాల బాలిక చేస్తున్న ఈ ప్రయత్నం ప్రస్తుతం అందరినీ ఆలోచింపజేస్తుంది.

ఆహార కొరతపై ఓ బాలిక ఆలోచన... సేవ్ సాయిల్ పేరుతో ప్రజల్లో అవగాహనకు సైకిల్ యాత్ర
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారం పేట గ్రామానికి చెందిన వెన్నెల అనే 15 సంవత్సరాల బాలిక ఇటీవల పదవ తరగతి పూర్తి చేసింది. భవిష్యత్తులో ఆహార కొరత వస్తుందని, జనాలు ఎవరూ దీని మీద దృష్టి సారించడం లేదని భావించిన వెన్నెల భూసారాన్ని పరిరక్షించుకోవాలన్న ఆలోచనతో , సేవ్ సాయిల్ అంటూ సైకిల్ యాత్ర చేపట్టింది. కామారెడ్డి జిల్లా నుంచి ప్రారంభించిన ఈ సైకిల్ యాత్ర ఇప్పటివరకు 21 రోజుల పాటు సాగింది.

మొత్తం 60 రోజుల పాటు 5,000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర
మొత్తం ఐదు వేల కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుతూ వెన్నెల భూసారాన్ని పరిరక్షించుకోవాలని, పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించనుంది. జగ్గీ వాసుదేవ్ వల్ల ప్రభావితమైన తాను ఈ విధంగా యాత్ర చేస్తున్నానని వెన్నెల చెబుతోంది. సైకిల్ యాత్ర 60 రోజుల్లో 5,000 కిలోమీటర్లు సాగుతుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ యాత్ర పూర్తవుతుందని, ప్రతిరోజూ 100 కిలోమీటర్లు యాత్రలో పర్యటించి భూసార సమస్యలపై రైతులతో సంభాషిస్తున్నట్లు వెన్నెల తెలియజేసింది. దారిపొడుగునా రైతుల నుండి, ఉపాధ్యాయుల నుండి వెన్నెల యాత్రకు విశేషమైన మద్దతు లభిస్తుంది.

భూసారం పెంచటంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న వెన్నెల
నిరు పేద రైతు కుటుంబం నుంచి తాను వచ్చినప్పటికీ, రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న రైతులకు భూసారాన్ని పెంచే విషయంలో అవగాహన కల్పించడం కోసం తన వంతు కృషి తాను చేస్తానని వెన్నెల చెబుతోంది. అంతేకాదు రానున్న తీవ్ర ఆహార సంక్షోభం నేపథ్యంలో భవిష్యత్తు తరాలను రక్షించాలని తాను సంకల్పించినట్లు వెన్నెల వెల్లడించింది. ప్రతి ఒక్కరికీ భూసారాని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని, లేదంటే తిండి లేక తిప్పలు పడాల్సి వస్తుందని వెన్నెల చెప్తుంది. ఇక తనతోపాటు ప్రభుత్వాలు కూడా సేవ్ సాయిల్ నినాదంతో ముందుకు రావాలని, భూసారాన్ని పరిరక్షించుకోవడానికి పాలసీలు తీసుకురావాలని వెన్నెల చెబుతోంది.

వెన్నెల ప్రయత్నాన్ని కొనియాడిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
ఇక వెన్నెల చేస్తున్న ప్రయత్నాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు కొనియాడారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వెన్నెలను కలిసిన కలెక్టర్ ఢిల్లీ రావు గారు ప్రభుత్వాలు, వ్యవసాయంపై అవగాహన ఉన్నవారు చెయ్యవలసిన పనిని చిన్నపిల్ల చేస్తోందని అభినందించారు. వెన్నెలకు తనవంతు సహాయంగా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు కలెక్టర్ ఢిల్లీ రావు. భూ పరిరక్షణ కోసం వెన్నెల చేస్తున్న కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఢిల్లీ రావు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications