తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు: 20వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. పరీక్షల సంఖ్య పెంచినకొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్రంలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు 41,475 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1579 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,26,124కు చేరింది.
పుట్టగొడులతో కరోనా కంట్రోల్: హైదరాబాద్ సీసీఎంబీ కీలక పరిశోధనలు, వ్యాక్సిన్ కంటే ముందే
మంగళవారం ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1287కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.

కరోనా బారి నుంచి తాజాగా 1811 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,04,388కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,449 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 17,071 మంది హోంఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటి వరకు 39,40,304 కరోనా పరీక్షలను నిర్వహించారు.
ఇది ఇలావుండగా, దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గత 24 గంటల్లో 54,044 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య
76,51,108కి చేరింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 717 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,15,914కి చేరుకుంది.
దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 7,40,090కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం రికవరీ రేటు 88.1 శాతంగా ఉంది. మరణాల రేటు 1.51 శాతానికి చేరింది. మంగళవారం కొత్తగా 10,83,608 నమూనాల్ని పరీక్షించారు. నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచడమే కేసుల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 67,95,103 మంది కరోనా నుంచి కోలుకున్నారు.