హైదరాబాద్‌లో 17 కిలోల బంగారం, వెండి స్వాధీనం: 3 కోట్ల వరకు నగదు సీజ్
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్ తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. దీంతో భారీ ఎత్తున నగదుతోపాటు బంగారం పట్టుబడుతోంది. హైదరాబాద్ మియాపూర్‌లోని మంజీరా రోడ్‌లో ఆదివారం రాత్రి పోలీసులు చేపట్టిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి.
ఎలాంటి సంబంధిత రశీదు లేకుండా తరలిస్తుండటంతో 17 కిలోల బంగారు ఆభరణాలు, 17 కిలోల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే సోమవారం ఉదయం మియాపూర్ చౌరస్తాలో జరిపిన తనిఖీల్లో రూ. 14 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జప్తు చేసిన సొమ్మునంతా ఆదాయశాఖకు అప్పగించినట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు. మరోవైపు, హైదరాబాద్ గాంధీ నగర్‌లో 2.9 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కవాడిగూడ ఎన్టీపీసీ వద్ద నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, గాంధీనగర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో టీఎస్ 09 ఎస్‌క్యూ 8507 ఒక కారుతోపాటు టీఎస్ 09 ఎస్‌జీ 3942 నెంబర్ గల లో అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ డబ్బు తరలిస్తున్న దినేష్ కుామర్ పాటిల్, సచిన్ కుమార్, విష్ణుబాయ్ పాటిల్, జితేందర్ పాటిల్, శివరాజ్, నవీన్ బాయ్ మోడీ, మీట్ ప్రకాశ్ పాటిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కారు, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా నగదు తరలిస్తున్నారని కేసు నమోదు చేశారు.

మరోవైపు, వనస్థలీపురంలో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. జాతీయ రహదారిపై కారులో తరలిస్తున్న రూ. 29.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో నిర్వహించిన తనిఖీల్లో రూ. 32 లక్షల స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గచ్చిబౌలిలో రూ. 10 లక్షలు సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకుండా ఈ సొమ్మును తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, రూ. 50 వేల కంటే ఎక్కువ మొత్తంలో నగదును తీసుకెళితే.. అందుకు సంబంధించిన పత్రాలు చూపించాల్సి ఉంటుందని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications