20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు: కేసీఆర్, జగన్‌పై జగ్గారెడ్డి సంచలనం
తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలనాపరంగా కాంగ్రెస్.. బీఆర్ఎస్ మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు ఏనాడూ సచివాలయానికి రాలేదని.. కేవలం వారి ఇళ్ల నుంచే పరిపాలన కొనసాగించారని విమర్శించారు.
బీజేపీ ఆదేశాలతోనే ఏపీ సీఎం జగన్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పనిచేస్తున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. వ్యాపారులను కేసీఆర్, కేటీఆర్ అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నారని అన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారని జగ్గారెడ్డి తెలిపారు.

తెలంగాణ అభివృద్ది చెందొద్దని జగన్, కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వారి ఎత్తుగడలను తిప్పికొడతామన్నారు. ఎమ్మెల్యేలను నిలబెట్టుకునేందుకే తమ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అంతేగాక, 20 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోపే ఈ 20 మందిని పార్టీలోకి తీసుకుంటామని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇది ఇలావుండగా, ఇటీవల పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ సిద్ధాంతాలు, నియమ నిబంధనలు.. ఇటీవల జరుగుతున్న పరిణామాల వల్ల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు, ఇటీవల కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఇలా చేస్తూ ప్రజలకు తప్పుడు సంకేతాలివ్వవద్దని.. ప్రభుత్వ పెద్దలతో ప్రజల్లోనే కలవాలని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications