గుడి నిర్వహణపై ఘర్షణ: 22మంది తీవ్రగాయాలు
కరీంనగర్: జిల్లాలోని సిరిసిల్ల మండలం మల్లాపూర్ గ్రామంలో గల ఎల్లమ్మ దేవాలయం నిర్వహణపై రెండు గ్రామాల ప్రజల మధ్య జరుగుతున్న ఘర్షణ చివరికి తారస్థాయికి చేరుకుని ఆదివారం పరస్పర దాడులకు దారి తీసింది. ఫలితంగా ఈ దాడుల్లో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. తలలు పగిలిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, వీరిని పోలీసులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఎనిమిది మందికి చేతులు విరిగాయి.
మల్లాపూర్‌లో జరిగిన ఈ ఘటనలో ఆలయ పూజారి సహా ఇరు వర్గాలకు చెందిన పలువురు దాడులకు గురయ్యారు. జిల్లెల్ల గౌడ సామాజిక వర్గం, మల్లాపూర్ గ్రామ ప్రజల మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో మహిళలు సైతం పాల్గొన్నారు. ఇరు వర్గాలు పథకం ప్రకారం రాళ్ళు, కర్రలు, కారంపొడితో దాడులు చేసుకుని బీభత్సం సృష్టించాయి.
మల్లాపూర్‌లోని ఎల్లమ్మ ఆలయాన్ని జిల్లెల్ల గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు.
మల్లాపూర్ గ్రామం గతంలో జిల్లెల్ల గ్రామ పంచాయతి పరిధిలో ఉండగా, ఇటీవల పంచాయతి ఎన్నికలకు ముందు నూతనంగా ఏర్పడిన ఇందిరానగర్ గ్రామ పంచాయతి పరిధిలోకి చేర్చారు. అయితే కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి తమ గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయాన్ని ఇక నుండి తామే నిర్వహించుకుంటామని, పొరుగు గ్రామమైన జిల్లెల్ల గౌడ సామాజిక వర్గీయులు ఇక నుండి ఆలయాన్ని నిర్వహించరాదన్న వాదన తెరపైకి తెచ్చారు.

మల్లాపూర్ గ్రామ ఎల్లమ్మ ఆలయం అనేక సంవత్సరాలుగా ఇక్కడ ప్రాచుర్యం పొంది, ఏటా దీని నిర్వహణకు రూ. 5 లక్షల మేర టెండర్లు కూడా పాడుతూ ఆదాయం పొందుతున్నారు. ఈ స్థితిలో కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి మల్లాపూర్ ఎల్లమ్మ ఆలయంలో నిర్వహణ పనుల్లో జిల్లెల్ల గౌడ ప్రతినిధులను మల్లాపూర్ వాసులు తరచూ అడ్డుకుంటున్నారు. పలుసార్లు పూజారిని కూడా అడ్డుకుని పూజలు నిర్వహించనీయలేదు. దీనిపై అనేక సార్లు ఘర్షణలు జరగడం, పోలీసులు రంగ ప్రవేశం చేసి హెచ్చరికలు చేయడం కూడా జరిగింది.
ఈ నేపథ్యంలో ఆదివారం ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేయడానికి వెళ్ళిన పూజారిని మల్లాపూర్ వాసులు అడ్డుకుని దాడి చేశారు. పూజారిపై దాడి చేసి పంపారన్న వార్తతో జిల్లెల్ల గౌడ కులస్తులు మల్లాపూర్‌కు వచ్చి ఎదురు దాడికి పూనుకున్నారు.
జిల్లెల్ల, మల్లాపూర్ ప్రజలు కర్రలు, రాళ్ళు చేతబట్టుకుని ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని కొట్టుకున్నారు. సంఘటన స్థలం వద్దకు పోలీసులు చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కరీంనగర్ ఆస్పత్రికి తరలించిన జిల్లెల్ల వాసుల్లో బాలసాని తిరుపతి, కోడూరి అరవింద్, కట్కూరి కిషన్, మల్లాపూర్ వాసుల్లో కారం రాములు, దేవ నర్సింహుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications