హైదరాబాద్ విమానాశ్రయంలో రూ. కోటి విలువైన అక్రమ బంగారం సీజ్
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. విదేశాల నుంచి వేర్వేరుగా ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తీసుకొస్తున్న సుమారు రెండు కిలోలకు పైగా బంగారాన్ని డీఆర్ఐ, కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
దుబాయ్ హైదరాబాద్‌కు వచ్చిన ఓ విమానంలో బంగారాన్ని తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన అధికారులు విమానం ఎయిర్ పోర్టుకు చేరుకోగానే తనిఖీలు చేపట్టారు.

ఓ సీటు కింద లైఫ్ జాకెట్‌లో దాచిన 2.3 కిలోల బంగారు బిస్కెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ సీటులో ప్రయాణికుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఇక మరో ప్రయాణికుడి నుంచి కూడా అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కువైట్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఓ ప్రయాణికుడు తీసుకొస్తున్న 160 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడికి నోటీసులు జారీ చేసి పంపించారు. కాగా, ఈ రెండు ఘటనల్లో పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ. కోటి వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications