లాక్‌డౌన్ మరింత కఠినంగా..: కేసీఆర్ కీలక ఆదేశాలు, తెలంగాణలో కొత్తగా 3464 కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అమలు తీరు, వైద్య సదుపాయాలు, మౌలిక వసతుల ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా సీఎం కేసీఆర్ శుక్రవారం వరంగల్ పర్యటన చేపట్టారు. మధ్యాహ్నం హెలీకాప్టర్ లో వరంగల్ చేరుకున్న సీఎం, తొలుత ఎంజీఎం దవాఖానాను సందర్శించారు. ఐసీయూలో, జనరల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషంట్ల ప్రతీ బెడ్డు వద్దకు కలియతిరిగి పేరు పేరునా వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత సీఎం కేసీఆర్ వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించారు. ఇక అక్కడి నుంచి ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.

లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలన్న కేసీఆర్
ఆ తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్లు,డీజీపీ, ఎస్పీ, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో కరోనా పరిస్థితి ఏవిధంగా ఉంది? కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కార్యాచరణ ఏమిటి? అని అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ధాన్యం సేకరణ వారం పదిరోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. 'రాష్ట్ర రెవెన్యూ నష్టం గురించి ఆలోచించకుండా లాక్‌డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజమెంట్ చట్టం నియమ నిబంధనల ప్రకారం, లాక్‌డౌన్ ను కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత డీజీపీతో సహా కలెక్టర్లకు ఉంది. ఉదయం సడలించిన 4 గంటలు మినహా, మిగతా 20 గంటలపాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలి. అత్యవసర సేవలను, పాస్‌లు ఉన్నవాళ్ళని మినహాయించి, ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదు' అని స్పష్టం చేశారు.

రోడ్లపై వడ్ల కుప్పలు చూశా.. ధాన్యం సేకరించండి..
అదే సమయంలో.. 'ధాన్యం సేకరణ వేగవంతంగా పూర్తి చేయాలి. నేను హెలీకాప్టర్‌లో వస్తున్న సందర్భంలో రోడ్లమీద వడ్ల కుప్పలు ఆరబోసి కనిపించాయి. నాలుగైదు రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశిస్తున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతరు. అందుకే ధాన్యం సేకరణ ప్రక్రియను సత్వరమే ముగించాలి' అని సీఎం కెసిఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లను, ఇతర ఉన్నతాధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో పేరు పేరునా సీఎం మాట్లాడారు. కరోనా, ధాన్యం సేకరణ, లాక్‌డౌన్ అమలు తదితర అంశాల మీద వారితో సమగ్ర చర్చ జరిపారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో లాక్‌డౌన్ కఠినంగా అమలు జరగక పోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులపై కేసీఆర్ ఆరా..
అదేవిధంగా జిల్లాల్లో మందుల సరఫరా ఎలా ఉంది?, ఆక్సిజన్ సరఫరా ఎలా ఉంది? అని సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మొదటి జ్వర సర్వేకు కొనసాగింపుగా.. రెండో విడత కూడా ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలని సీఎం సూచించారు. హాస్పిటళ్ల పరిశుభ్రత మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో చెత్తను ఎప్పటికప్పుడు తీసేయడానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సహా అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశాలిచ్చారు. కోవిడ్ హాస్పిటళ్లలో సేవలందిస్తున్న అన్నిరకాల ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. వైద్య సిబ్బంది ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సీఎం కోరారు.

వారికీ వ్యాక్సిన్ వేయాల్సిందే..
రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్ప్రెడర్స్ (ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, కూరగాయాల వ్యాపారులు, సేల్స్ మెన్) తదితరులందరినీ గుర్తించి జాబితాను రూపొందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం ఆదేశించారు. వీరందరికీ వ్యాక్సినేషన్ చేసే విషయమై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. యాదాద్రి, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గడం లేదని, వెంటనే ఈ జిల్లాలకు స్వయంగా వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జిల్లాల కలెక్టర్లు కరోనా కట్టడి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే, ధాన్యం సేకరణ కార్యక్రమం వెంటనే ముగించాలన్నారు. ఈ క్లిష్ట సమయంలో దవాఖానాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికీ సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.
Recommended Video

తెలంగాణలో కొత్తగా 3464 కరోనా కేసులు, 25 మంది మృతి
తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 65,997 నమూనాలను పరీక్షించగా.. 3464 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల 5,47,727కు చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 3085కు పెరిగింది. కొత్తగా 4801 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 5,00,247కు చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 534 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, రంగారెడ్డి జిల్లాలో 243, మేడ్చల్ జిల్లాలో 219 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.












Click it and Unblock the Notifications