శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 36 విమానాలు రద్దు.. ప్రయాణికులకు కీలక అలెర్ట్!
విమాన ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులు అకస్మాత్తుగా రద్దయిన విమానాల తీరుతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిన్నటి నుంచి విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో నిన్న వందకు పైగా విమానాలను రద్దు చేసింది. ఒక్క శంషాబాద్ విమానాశ్రయం నుండి 40 విమాన సర్వీసులు రద్దు చేయడంతో చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
విమాన సర్వీసులకు అంతరాయం
ఒకపక్క శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళుతున్న అయ్యప్ప భక్తులు కొచ్చిన్ విమానం రద్దు చేయడంతో ఆందోళన వ్యక్తం చేశారు. విమానాశ్రయంలోనే ఆందోళనకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే నిన్నటి పరిస్థితి నేడు కూడా కొనసాగుతుంది. మరో 48 గంటల పాటు విమాన సర్వీసులకు అంతరాయం కొనసాగే అవకాశం ఉందని అంచనా ఉంది.

నేడు శంషాబాద్ విమానాశ్రయం నుండి 36 ఇండిగో విమానాలు రద్దు
నేడు కూడా శంషాబాద్ విమానాశ్రయం నుండి 36 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇటీవల పైలెట్ల విధులను నియంత్రణ పైన డీజీసీఏ నిబంధనలు, రాత్రివేళ విమానాలు ల్యాండింగ్ తగ్గించడం ఈ సమస్యలకు కారణమని ఇండిగో వెల్లడించింది. ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పెరిగిన రద్దీ, సాంకేతిక సమస్యలు, సిబ్బంది రోస్టర్ నిబంధనల అప్గ్రేడ్ తో తలెత్తిన ఇబ్బందులు కూడా విమానాల రద్దుకు కారణమని ఇండిగో ప్రకటించింది.
విమానాల రద్దు ఇందుకే
అయితే వనరుల ప్రణాళిక లోపంతో ఇండిగో విమానాలు రద్దయ్యాయి అని, ఈ అంతరాయాలకు ప్రణాళిక లోపమే కారణమని ఎయిర్లైన్స్ పైలెట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించింది. ఇప్పటికే సిబ్బంది కొరత విమానయాన సంస్థలలో ప్రధానంగా ఉందని, ఈ సమయంలో డీజీసీఏ తీసుకువచ్చిన విమాన విధుల సమయ పరిమితి వల్ల కూడా పైలెట్ల కొరత ఏర్పడిందని ఎయిర్లైన్స్ పైలెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అభిప్రాయం వ్యక్తం చేసింది.
ప్రయాణికులకు అలెర్ట్
అయితే తాజాగా విమానాలను రద్దు చేయడం పైన డీజీసీఏ విచారణ ప్రారంభించింది. ఇప్పటికే ప్రయాణికులకు అసౌకర్యం కలిగించిన ఇండిగో కు నోటీసులు కూడా జారీ చేసింది. ఇక తాజా విమానాల రద్దు నేపధ్యంలో ప్రయాణికులు అలెర్ట్ గా ఉండాలని, ముఖ్యమైన పనులు ఉంటే ప్రత్యామ్నాయాలు కూడా ప్లాన్ చేసుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications