శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 41 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్: ఆ మహిళకు ఏం తెలియదు!
హైదరాబద్: మరోసారి హైదరాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు చేపట్టగా.. మత్తుపదార్థాలు బయటపడ్డాయి. హెరాయిన్ అక్రమ రావాణా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) అధికారులు రట్టు చేశారు. ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి రూ. 41.30 కోట్ల విలువైన హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పక్కా సమాచారంతో అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో నిఘా పెట్టారు. ఆఫ్రికాలోని మాలావి నుంచి దోహా మీదుగా హైదరాబాద్ చేరుకున్న ప్రయాణికురాలి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో ఆమె లగేజీని తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే ఆమె సూట్‌కేసును డీఆర్ఐ తనిఖీ చేయగా.. అందులో తెల్లటి పౌండర్ బయటపడింది. దీన్ని హెరాయిన్‌గా గుర్తించిన అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

5.9 కిలోల బరువున్న హెరియాన్‌ను ఎవరికీ అనుమానం రాకుండా సూట్‌కేసులో తరలిస్తున్నట్లు తేల్చారు. భారతీయురాలైన ఆ మహిళ.. మాలావి నుంచి హెరాయిన్‌ను తీసుకుని హైదరాబాద్‌లో ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ హెరాయిన్ ఎక్కడికి చేరవేయాలనుకున్నారనే దానిపై అధికారులు విచారిస్తున్నారు. అయితే, స్మగ్లర్లు మాత్రం నిఘా ఏజెన్సీలకు పట్టుబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు దర్యాప్తులో తేల్చారు. హెరాయిన్ చేరవేస్తే కొంత డబ్బు ఇచ్చేలా మహిళతో ఒప్పందం కుదుర్చుకుని.. శంషాబాద్ విమానాశ్రయంలో నిర్దేశించిన ప్రాంతానికి తీసుకెళ్లాలని సూచించినట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో హెరాయిన్ ను తీసుకునే వాళ్ల వివరాలు కూడా నిందితురాలికి తెలియదని డీఆర్ఐ అధికారులు భావిస్తున్నారు.

విమానాశ్రయాల్లో నిఘా పెరిగిపోవడంతోనే స్మగ్లర్లు ఇలా ఇతరులతో తమ పనులను చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ దొరికినా.. తమ గుట్టుబయటపడకుండా స్మగ్లర్లు జాగ్రత్త పడుతున్నారు. అయితే, అధికారులు మాత్రం స్మగర్ల ఎత్తులను చిత్తు చేస్తూ డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు.












Click it and Unblock the Notifications