షాకింగ్ : నిజామాబాద్‌లో ఒకే గ్రామంలో 86 మందికి కరోనా పాజిటివ్...
తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఫిబ్రవరి నెల వరకూ వంద మార్క్‌కి అటు ఇటుగా నమోదైన కేసులు తాజాగా మళ్లీ వెయ్యి మార్క్‌ని చేరాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,321 కొత్త కేసులు నమోదవగా... మరో ఐదుగురు కరోనాతో మృతి చెందారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సిద్దపూర్ గ్రామంలో ఓ వివాహ వేడుకకు హాజరైనవారిలో 86మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. పెళ్లికి భారీ ఎత్తున బంధుమిత్రులు తరలివచ్చారు. వీరిలో 370 మందికి కరోనా టెస్టులు చేయగా 86 మందికి పాజిటివ్‌గా తేలింది. మిగతావారికి ఇంకా టెస్టులు చేయాల్సి ఉంది.
జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలోనూ భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రామంలో 27 మందికి కరోనా సోకడంతో ఈ నెల 15 వరకు లాక్‌డౌన్ విధిస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. లాక్‌డౌన్‌లో భాగంగా ఉదయం 6 గంటల నుండి 10గంటల వరకు మాత్రమే కిరాణ షాపులకు అనుమతినిచ్చారు. గ్రామంలో ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించడం,భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు.

కాగా, గడిచిన 24 గంటల్లో 1,321 కొత్త కేసులు నమోదవడంతో... రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,12,410కు చేరింది. ఇప్పటివరకూ కరోనాతో 1,717 మంది మృతి చెందగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 7,923 కరోనా యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 93,249 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 513 మంది మృత్యువాతపడ్డారు.
ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే 277 మంది కరోనాతో మృతి చెందడం గమనార్హం. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,24,85,509కి చేరుకోగా... మొత్తం మృతుల సంఖ్య 1,64,623కి చేరింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు, అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో కరోనా పరిస్థితులపై ఆదివారం(ఏప్రిల్ 4) ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్,హెల్త్ సెక్రటరీ,కేబినెట్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications