టీఆర్ఎస్ దృష్టిలో 14 పెద్దది... 94 చిన్నదా...? ఎలక్షన్ల పర్వంలో గులాబీనేతల మర్మమేంటి?

హైదరాబాద్ : లక్ష్య సాధన చిన్నగా ఉండకూడదు. టార్గెట్ అంటే పెద్దగా ఉండాలే. ఎవర్ని అడిగినా ఇదే మాట చెబుతారు. కానీ టీఆర్ఎస్ బాస్ ఏంటి... పెద్ద సంఖ్యను వదిలి చిన్న సంఖ్య మీద దృష్టి పెట్టారు. 94 ను కాదంటూ 14 ను టార్గెట్ చేశారు. వాస్తు, సంఖ్యాశాస్త్రాలను బలంగా నమ్మే కేసీఆర్ లెక్క తప్పినట్లా. అసలు ఈ 14 ఏమిటి... 94 ఏమిటి. మొత్తానికి కథ ఏమిటంటారా. ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన టీఆర్ఎస్ పార్టీ తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాదనుకుంటోంది. ఛాన్స్ దొరికితే చాలు టీడీపీనే టార్గెట్ చేస్తోంది. మహాకూటమిలో భాగంగా 119 స్థానాలకు గాను అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం కంటే కూడా... కేవలం 14 స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీని గులాబీదండు టార్గెట్ చేస్తోంది.

వాస్తవానికి తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ నాలుగున్నరేళ్ల కాలంలో టీడీపీ బలహీనపడిందనే చెప్పొచ్చు. టీడీపీ క్యాడర్ చాలామటుకు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అంతో ఇంతో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మాత్రం టీఆర్ఎస్ లెక్కల్లోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు. అసలు కాంగ్రెస్ తమకు ఏరకంగా పోటీ కాదనే విషయాన్ని పలు సందర్భాల్లో గులాబీనేతలు వ్యాఖ్యానిస్తుండటం... అదే సమయంలో టీడీపీని టార్గెట్ చేయడం చూస్తుంటే టీఆర్ఎస్ స్ట్రాటజీ ఇట్టే అర్థమవుతుంది. రాష్ట్రంలో ఎన్నో పార్టీలున్నా కూడా టీఆర్ఎస్ మాత్రం తన ప్రధాన ప్రత్యర్థిగా టీడీపీని చూడటం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్. తాజాగా టీడీపీపై గులాబీ బాస్ కేసీఆర్ చేసిన కామెంట్లు చర్చానీయాంశంగా మారాయి. 14 స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీకి కాంగ్రెస్ శ్రేణులు సహకరించవని కుండబద్దలు కొట్టారు కేసీఆర్. అంతేకాదు టీడీపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

టీడీపీ విధానాలపై టీఆర్ఎస్ గుస్సా...!

టీడీపీ విధానాలపై టీఆర్ఎస్ గుస్సా...!

టీడీపీ అనుసరిస్తున్న విధానాలతో టీఆర్ఎస్ పార్టీ నేతలు గుర్రుగా ఉంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ పట్ల గులాబీ నేతలు మండిపడ్డారు. అదలావుంటే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు ఇరుక్కోవడంతో ఆ కథంతా టీఆర్ఎస్ నేతలే నడిపారంటూ పెద్ద రాద్దాంతమే చేశారు టీడీపీ లీడర్లు. అలా ఈ రెండు పార్టీల మధ్య అంతరం మరింత పెరిగినట్లయింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయాక కూడా పోలవరం ప్రాజెక్టు, సీలేరు జలాశయం మొదలు అనేక అంశాల్లో ఈ పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అదలావుంటే కొన్ని వేదికల మీద చంద్రబాబు నాయుడు, కేసీఆర్ చేతులు కలిపిన సందర్భాలున్నాయి. దాంతో ఇద్దరూ చంద్రులు కలిసిపోయారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే తదనంతర పరిణామాలు చూస్తే ఇద్దరూ కలిసిపోవడం ఏమో గానీ, దూరం మరింత పెరిగిందనే చెప్పొచ్చు. తాజాగా ఎన్నికల వేళ కాంగ్రెస్ తో మహాకూటమిగా టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. అనైతిక పొత్తుగా అభివర్ణించడమే గాకుండా టీడీపీకి శాపనార్థాలు పెడుతున్నారు. టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా టీడీపీ నేతలు కాంగ్రెస్ తో జతకట్టారని ఫైరవుతున్నారు.

కాంగ్రెస్ తో పొత్తేంటి...?

కాంగ్రెస్ తో పొత్తేంటి...?

తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా టీడీపీ అనుసరించిన వైఖరిని టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటిది ఇప్పుడు ఎలక్షన్ల సమయంలో టీడీపీ తీసుకున్న స్టాండ్ గులాబీ లీడర్లకు మరింత కోపం తెప్పిస్తోంది. పార్టీ సిద్ధాంతాలు పక్కనబెట్టి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడమేంటని బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా టీడీపీ అధిష్టానంపై విరుచుకుపడుతున్నారు. అదేక్రమంలో టీడీపీని టార్గెట్ చేస్తూ ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో కూడా టీడీపీ టార్గెట్ గానే మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్ ను ఓడించడం ఎవరితరం కాదని... బలం లేకనే టీడీపీ పొత్తులబాట పట్టిందని విమర్శిస్తున్నారు. తెలంగాణలో టీడీపీకి అసలు ఓటు బ్యాంకు లేదని ప్రచారం చేస్తున్నారు. సైద్దాంతిక విభేదాలు పక్కనబెట్టి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడమే గాకుండా... టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారనేది గులాబీదండు వాదన. ఒకనాడు సోనియాగాంధీని దెయ్యంలా అభివర్ణించిన చంద్రబాబు... ఇప్పుడు దేవతగా కొలవడమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి సంచులకొద్దీ డబ్బులు పంపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇంటెలిజెన్స్ విభాగాన్ని బాగా వాడుకోవడం తెలిసిన చంద్రబాబు... మొన్నటికి మొన్న జగిత్యాల జిల్లా ధర్మపురిలో సర్వే చేయించారనే ఆరోపణలు గులాబీశ్రేణుల కోపానికి మరింత ఆజ్యం పోశాయి. ఈ క్రమంలో తెలంగాణవాదానికి అప్పట్లో అడ్డుపడిన చంద్రబాబును టార్గెట్ చేస్తూ టీడీపీని బలహీనపరిస్తే కాంగ్రెస్ బలం తగ్గుతుందనేది టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ప్రచారపర్వంలో టీడీపీని టార్గెట్ చేస్తూ గులాబీనేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు.

టీడీపీయే ఎందుకు టార్గెట్...!

టీడీపీయే ఎందుకు టార్గెట్...!

తెలంగాణ ఉద్యమంలో టీడీపీ అడుగడుగునా అడ్డుపడిందని... రాష్ట్రం విడిపోయాక కూడా తెలంగాణకు చంద్రబాబు నాయుడు అడ్డంకులు సృష్టించారనేది టీఆర్ఎస్ నేతల వాదన. అందుకే ఆ పార్టీని తమకు ప్రధాన ప్రత్యర్థిగా టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. అంతేకాదు తెలంగాణలో టీడీపీ ఉనికి లేకుండా చేయాలనేది వారి లక్ష్యంగా కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంటే... తెలంగాణ ఏర్పడ్డాక ఆ పార్టీ క్యాడర్ ను చాలావరకు తమవైపు తిప్పుకున్నారు గులాబీ నేతలు. దీంతో టీడీపీని తెలంగాణలో కనుమరుగు చేయాలనే టీఆర్ఎస్ లక్ష్యం దాదాపుగా నెరవేరినట్లయింది. తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందని ఇక ముందస్తు ఎన్నికల్లో బలం చాలక పోటీలో ఉండకపోవచ్చని గులాబీనేతలు భావించారు. అనూహ్యంగా కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ పొత్తుకు సిద్ధమవడంతో టీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మహాకూటమి పొత్తులో భాగంగా 14 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులను ఏలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. గులాబీ బాస్ కేసీఆర్ కూడా టీడీపీని ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని పార్టీశ్రేణులకు సూచించారు.

మహాకూటమిలో ఎవరి ఓటు బ్యాంకు ఎవరికి కలిసొచ్చే...!

మహాకూటమిలో ఎవరి ఓటు బ్యాంకు ఎవరికి కలిసొచ్చే...!

తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మార్చాలన్నదే టీఆర్ఎస్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. అయితే టీడీపీ క్యాడర్ చాలావరకు గులాబీ తీర్థం పుచ్చుకున్నా కూడా పార్టీ పట్ల అభిమానం ఉన్నవారు లేకపోలేదు. టీడీపీ పార్టీ సభ్యత్వం ఉన్నవాళ్లకు సోషల్ మీడియా వింగ్ టచ్ లో ఉంటోంది. ఎప్పటికప్పుడు పార్టీ నిర్ణయాలు, కార్యక్రమాలు క్యాడర్ కు చేరవేస్తోంది. దీంతో టీడీపీ ఓటు బ్యాంకుకు అంతో ఇంతో ఢోకా లేదనేది అధిష్టానం నమ్మకం. దీంతో మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేసే చోట్ల టీడీపీ ఓటు బ్యాంకు కలిసివచ్చే ఛాన్సుంది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే 14 చోట్ల మాత్రం కాంగ్రెస్ ఓటుబ్యాంకు కలిసొస్తుందా అనేది డౌట్. ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్ శ్రేణుల సహకారం వారికి లభించదనేది గులాబీ నేతల కామెంట్. అంతేకాదు కాంగ్రెస్ ను నమ్ముకుని మహాకూటమితో జతకట్టిన టీడీపీకి తగిన శాస్తి జరుగుతుందని ఘంటాపథంగా చెబుతున్నారు. 14 చోట్ల టీడీపీ అభ్యర్థులకు అపజయం ఖాయమని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో జనాకర్షణ లేదన్నది గులాబీశ్రేణుల వాదన. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు అడుగడుగునా మోసమే జరిగిందని... ఆ విషయం ప్రజలకు తెలుసన్నది టీఆర్ఎస్ అధిష్టానం బలంగా నమ్ముతోంది. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తమకు పోటీయే కాదన్నట్లు వ్యవహరిస్తున్న టీఆర్ఎస్... సైకిలు గుర్తు తెలంగాణలో లేకుండా చేయడమే టార్గెట్ గా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+