అరెకపూడి గాంధీ, ఆయన అనుచరులపై కేసు నమోదు
Arekapudi Gandhi: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనలో అరెస్టయిన ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ స్టేషన్ బెయిల్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్ తదితరులు ఈ సందర్భంగా అరికెపూడి గాంధీకి సంఘీభావం తెలిపారు.
పోలీసులు ఇచ్చిన 41 నోటీసుకు వివరణ ఇచ్చినట్లు అరికెపూడి గాంధీ తెలిపారు. తనను ఆహ్వానిస్తేనే కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లానని.. కానీ, తమపై దాడి చేశారని తెలిపారు. కౌశిక్ భార్య విల్లాపై నుంచి పూలకుండీ, మొక్కలు తమ కార్యకర్తలపై విసిరేశారని చెప్పారు. తనను 40 మంది అడ్డుకున్నారన్నారు.ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించారని కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు.

కౌశిక్ రెడ్డి.. తనను ఆంధ్రావాడు అన్నారని అరికెపూడి గాంధీ తెలిపారు. అదే బీఆర్ఎస్ విధానమైతే ఆ పార్టీ నాయకత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. లేకపోతే పార్టీ అధినేత కేసీఆర్.. కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాము కూడా కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశామని తెలిపారు.
అరికపూడి గాంధీపై కేసు నమోదు
అరికపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడంతో ఈ వివాదం మొదలైంది. కౌశిక్ రెడ్డి అన్న మాట ప్రకారం.. గాంధీ ఇంటికి వెళ్లకపోవడంతో.. ఆయనే తన అనుచరులను వెంటపెట్టుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ ఇంటికి వెళ్లారు. దీంతో కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. కొంతమంది అరెకపూడి అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. కోడిగుడ్లతో కౌశిక్, అరికపూడి అనుచరులు దాడులు చేసుకున్నారు.
కాగా, ఈ ఘటనను సుమోటో కేసుగా తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు.. అరికపూడి గాంధీ, ఆయన అనుచరులపై బీఎన్ఎస్ చట్టంలోని 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏ1గా అరెకపూడి గాంధీతోపాటు 15 మంది అనుచరులపై సెక్షన్లు 189, 191(2), 191(3), 61,132, 329, 333, 324(4), 324(5), 351(2), రెడ్ విత్ 190 బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు. గచ్చిబౌలి ఎస్ఐ మహేష్ కుమార్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications