తెలంగాణలో సరిహద్దు జిల్లాల్లో పెద్దపులి దాడుల కలకలం: ఒకరు మృతి
కరీంనగర్: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పులుల సంచారం గత కొంతకాలంగా కలకలం రేపుతున్నాయి. తాజాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ అవతలి తీరమైన మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూక పెంటిపాక అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తోంది.
పెద్దపులి.. ఓ పశువుల కాపరిపై పులిదాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి పెద్దపులి బారినుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పెంటిపాకకు చెందిన పశువుల కాపరి సమీప అటవీ ప్రాంతంలో మేతకోసం పశువులను తీసుకోని వెళ్ళగా ఆకస్మాత్తుగా పులి దాడి చేసిందని స్థానికులు తెలిపారు.

ఈ దాడిలో దుర్గం మల్లయ్య (50) అనే పశువుల కాపరీ తీవ్రమైన గాయాలతో అక్కడిక్కడే మృత్యువాత పడగా, మరో వ్యక్తి పులి దాడి నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు. వారిపైనే కాకుండా పులి పశువులపైన దాడి చేసి గాయపర్చినట్లు ఆప్రాంతానికి చెందిన ప్రజలు చెబుతున్నారు.
పెంటిపాక అటవీ ప్రాంతం తెలంగాణకు సరిహద్దు ప్రాంతం కావడంతో మహదేవహర్, పలిమెల, మహముత్తారం మండలాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిని ఆ ప్రాంతానికి చెందిన అటవీశాఖ అధికారులు పులి లేదా చిరుత పులి దాడి చేసిందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ విషయమై స్థానిక అటవీశాఖ అధికారులను సంప్రదించగా తమకెలాంటి సమాచారం లేదని తెలిపారు.
అయితే, గతంలో కూడా మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోని పులులు తెలంగాణలోని సరిహద్దు గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను బెంబేలెత్తించాయి. పలుమార్లు పశువులపై దాడులు కూడా చేశాయి. ఒకరిద్దరు అటవీ ప్రాంతానికి సమీపంలోని వ్యక్తులు కూడా పులి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. రెండు రాష్ట్రాల సరిహద్దులో భారీ అటవీ ప్రాంతం ఉండటంతో క్రూర మృగాల సంచారం ఇటీవల కాలంలో పెరిగిపోయింది.












Click it and Unblock the Notifications