కాళ్లు, చేతులు కట్టేసి, మరదలిపై అత్యాచారం: నిర్భయ కేసు నమోదు
హైదరాబాద్: నగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిండు గర్భిణిగా ఉన్న అక్కకు తోడుగా వచ్చిన ఓ యువతిపై ఆమె బావే అత్యాచారానికి పాల్పడ్డాడు. కాళ్లు చేతులు కట్టేసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం తీవ్రంగా కొట్టి, ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరింపులకు గురిచేశాడు.
పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా శివంపేట మండలం చెన్నాపూర్ తాండాకు చెందిన విఠల్(35) తన భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం కాలనీలోని మరాఠీ బస్తీలో కొంతకాలంగా నివాసముంటున్నాడు. కూతుళ్లిద్దరూ స్థానిక పాఠశాలలో నర్సరీ, ఎల్కేజీ చదువుతున్నారు.
కాగా, విఠల్ భార్య గర్భిణి కావడంతో ఆమె తోడు కోసం తన సోదరి(20)ని పిలిపించుకుంది. బుధవారం విఠల్ తన భార్యను మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని వైద్యశాలలో చెకప్ చేయించాడు. ఆ తర్వాత తన సొంతూరు చెన్నాపూర్ తండాలో వదిలి తిరిగి ఒక్కడే మధ్యాహ్నం సూరారం కాలనీకి చేరుకున్నాడు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న మరదలిని లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో కాళ్ళు, చేతులు తాళ్లతో కట్టేసి చితకబాదాడు. అరిస్తే చంపుతానని బెదిరింపులకు గురిచేసి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటికి చెబితే చంపేస్తానని బెదిరించాడు.
కాగా, ఆ తర్వాత విఠల్ ఇంటి నుంచి బయటికెళ్లడం గమనించిన బాధిత యువతి.. అక్కడ్నుంచి తప్పించుకుని దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు విఠల్‌పై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications