పెద్దల పాపమేనా?: బావ ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజే మరదలు
జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బావ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక అతని మరదలు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
నిజామాబాద్: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బావ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక అతని మరదలు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నవీపేట మండలం జన్నేపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకొంది.
స్థానిక ఎస్సై రవీందర్ నాయక్, గ్రామస్తుల కథనం ప్రకారం.. జన్నేపల్లి గ్రామానికి చెందిన నందిని(19) నందిపేట మండలం మల్లారం గ్రామానికి చెందిన సాయికుమార్(19)ను ప్రేమించింది.

వీరిద్దరూ జిల్లా కేంద్రం నిజామాబాద్‌లోని ఒకే కళాశాలలో ఇటీవలే ఇంటర్ పూర్తిచేశారు. డిగ్రీలో చేరారు. కాగా, వీరిద్దరూ బావ, మరదళ్లు అయినప్పటికీ వారి పెళ్లికి సాయికుమార్ కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు.
దీంతో మనస్తాపానికి గురైన సాయికుమార్.. సోమవారం తన స్వంత ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేనల్లుడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నందిని తల్లిదండ్రులు వాణి, శ్రీనివాస్ మంగళవారం మల్లారం వెళ్లారు.
కాగా, బావ మృతిని తట్టుకోలేక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకొని అత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. నందిని నిజామాబాద్ పట్టణంలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు చెప్పారు. తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.












Click it and Unblock the Notifications