పెళ్లికి అంగీకరించలేదని ఉరేసుకుని ప్రేమికుల ఆత్మహత్య: రైలుకు ఎదురెళ్లి మరో జంట
హైదరాబాద్/మహబూబ్‌నగర్: ఓ ప్రేమజంట శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని దామరగిద్ద మండలంలోని లింగారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న శంకరమ్మ(14) అదే గ్రామానికి చెందిన తిరుమలప్ప(20) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామంటూ శంకరమ్మ కొన్ని రోజుల నుంచి గొడవపడుతోంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో తిరుమలప్ప కూడా పెళ్లికి సుముఖత వ్యక్తం చేయలేదు.
దీంతో శనివారం అర్ధరాత్రి శంకరమ్మ పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తిరుమలప్ప తనపై పోలీసు కేసు నమోదవుతుందేమోనన్న భయంతో తాను కూడా అదే పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

రైలుకు ఎదురెళ్లి ప్రేమజంట ఆత్మహత్య
పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమజంట రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్‌ఐ ప్రమోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... లోతుకుంటకు చెందిన నర్సింగ్(23) లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.
కార్ఖానకు చెందిన శిరీష (20) వెంకటాపూర్‌లోని ఓ కాలేజీలో డిగ్రీ బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. వీరిద్దరూ బస్టాపులో పరిచయమయ్యారు. ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియదు. అబ్బాయికి తల్లిదండ్రులు లేరు. వీరిద్దరూ పెళ్లి చేసుకునే విషయంలో గొడవ పడినట్లు తెలిసింది.
అబ్బాయి తనకు తమ్ముడు ఉన్నాడు. కొంతకాలం ఆగుదామన్నాడు. అయితే శనివారం వీళ్లకు స్నేహితులు గుడిలో పెళ్లి చేద్దామని ఏర్పాట్లు చేశారు. భోజనం చేసి వస్తామని చెప్పిన ఆ ప్రేమజంట అల్వాల్ రైల్వే స్టేషన్‌కు చేరుకొని ప్రయాణికుల మాదిరిగా కూర్చొన్నారు. మధ్యాహ్నం సమయంలో పాసింజర్ రైలు వస్తుండగా ఇద్దరు చేతులు పట్టుకుని రైలు ముందు దూకారు.
అమ్మాయి చనిపోగా, నర్సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సాయంత్రం చనిపోయాడు. పోలీసులు ఇరు కుటుంబాలకు సమాచారం అందించారు. మృతదేహాలను మార్చురిలో భద్రపరిచారు. కేసును పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications